
'ప్రాజెక్ట్ అదితి'ని ప్రారంభించిన కుటుంబ సభ్యులు
విశాఖపట్నం: ప్రతి సామాన్యునికి 'ప్రాజెక్ట్ అదితి' ఓ శక్తిమంతమైన వేదిక కావాలన్నదే తమ లక్ష్యమని చిన్నారి అదితి కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఆదివారం విశాఖపట్నంలో ఆర్కే బీచ్ వద్ద ప్రాజెక్ట్ అదితిని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ప్రారంభించారు.
నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించి... వాటిని సంబంధి ప్రభుత్వ శాఖకు తెలియపరచడం ద్వారా సదరు సమస్యలు త్వరితగతిన పరిష్కారం లభించేందుకు కృషి చేయడమే ప్రాజెక్ట్ అదితి లక్ష్యమని వారు ఈ సందర్భంగా వివరించారు. అనంతరం ప్రాజెక్ట్ అదితి కోసం నిర్వహించిన అవేర్నెస్ వాక్లో స్వచ్చంధ సంస్థలతోపాటు యువత, చిన్నారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
సెప్టెంబర్ 24వ తేదీన విశాఖపట్నంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. అరేళ్ల చిన్నారి అదితి అప్పుడే ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలువ పడి పోయింది. ఆమె కోసం ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. అయితే గురువారం సాయంత్రం విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం సమీపంలోని సన్ రే బీచ్ ఒడ్డుకు అదితి మృతదేహం కొట్టుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అదితికి జరిగిన అన్యాయం మరోకరికి జరగకూడదని ఆమె కుటుంబ సభ్యులు భావించారు. ఈ నేపథ్యంలో వారు ప్రాజెక్ట్ అదితిని ప్రారంభించారు.