దుమ్మురేపుతున్న 'రాయిస్‌'.. తొలి రికార్డు! | Raees box office collection Day 5 | Sakshi
Sakshi News home page

దుమ్మురేపుతున్న 'రాయిస్‌'.. తొలి రికార్డు!

Published Mon, Jan 30 2017 1:51 PM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

దుమ్మురేపుతున్న 'రాయిస్‌'.. తొలి రికార్డు!

దుమ్మురేపుతున్న 'రాయిస్‌'.. తొలి రికార్డు!

షారుఖ్‌ ఖాన్‌ తాజా సినిమా 'రాయిస్‌' భారీ వసూళ్లతో వందకోట్ల క్లబ్బు వైపు దూసుకుపోతున్నది. ఐదురోజుల్లో దేశీయంగా రూ. 93. 24 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా త్వరలోనే వందకోట్ల క్లబ్బులో అడుగుపెట్టనుంది. దీంతో ఈ ప్రతిష్టాత్మక లిస్ట్‌లో చోటు సాధించిన ఏడో షారుఖ్‌ సినిమాగా రికార్డు సొంతం చేసుకోనుంది.

ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో అత్యధిక ప్రారంభ వసూళ్లు సాధించిన సినిమాగా బాక్సాఫీస్‌ రూల్‌ చేస్తున్న 'రాయిస్‌' ఆదివారం రూ. 17.8 కోట్లు సాధించింది.  అయితే, ఈ సినిమాకు పోటీగా దిగిన హృతిక్‌ రోషన్‌ 'కాబిల్‌' సినిమా కూడా మంచి వసూళ్లే రాబడుతున్నది. సంజయ్‌ గుప్తా దర్శకత్వంలో వైవిధ్యమైన కథతో తెరకెక్కిన ఈ సినిమా తొలి ఐదురోజుల్లో దేశీయంగా రూ. 67.46 కోట్లు సాధించింది. ఆదివారం షారుఖ్‌ సినిమాకు  గట్టిపోటీనిస్తూ.. 'కాబిల్‌' రూ. 15.61 కోట్లు సాధించడం గమనార్హం.

బుధవారం విడుదలైన షారుఖ్‌ 'రాయిస్‌' సినిమా.. తొలిరోజు రూ. 20.42 కోట్లు, రెండో రోజు రూ. 26.30 కోట్లను వసూలు చేసింది. మూడో రోజు రూ. 13.11 కోట్లు, నాలుగో రోజు రూ. 15.61 కోట్లు, ఐదో రోజు రూ. 17.80 కోట్లు సాధించిందని, మొత్తంగా 'రాయిస్‌' రూ. 93.24 కోట్లు రాబట్టిందని తరణ్‌ ఆదర్శ్ ట్విట్టర్‌లో తెలిపారు. ప్రస్తుత వారంలోనూ వసూళ్లు ఈ సినిమాకు కీలకం కానున్నాయని వ్యాఖ్యానించారు.

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ స్టామినాతో పోల్లుకుంటే ఈ కలెక్షన్లు తక్కువేనని చెప్పాలి. ఇతర బాలీవుడ్‌ సూపర్‌ స్టార్లు సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌ సినిమాల ఓపెనింగ్స్‌తో పోల్చుకుంటే షారుఖ్‌ వెనుకబడినట్టేనని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.

షారుఖ్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ప్రధానపాత్రలో రాహుల్‌ దోలాఖియా దర్శకత్వంలో తెరకెక్కిన 'రాయిస్‌' సినిమాకు విమర్శకుల నుంచి నెగిటివ్‌ రివ్యూలు వచ్చాయి. అయినా షారుఖ్‌ను తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండటంతో మొదట్లో 'కాబిల్‌' కన్నా మెరుగైన వసూళ్లు ఈ సినిమా రాబట్టింది. అయితే, రానురాను 'కాబిల్‌' సినిమాకు కూడా ఆదరణ పెరుగుతుండటంతో ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద ఈ రెండు సినిమాల మధ్య పోటాపోటీ నెలకొంది.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement