
బీజేపీ, కాంగ్రెస్‌లను అడ్డుకోవాలి: రాఘవులు
సాక్షి, హైదరాబాద్: విదేశీ పెట్టుబడిదారులు, కార్పొరేట్ వర్గాలకు కొమ్ముకాసే పార్టీలను 2014 ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజల పై ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వస్తే విదేశీపెట్టుబడులు, సామాన్యుల నడ్డివిరిచే ఆర్థిక సంస్కరణలు అమలు వేగవంతంగా జరుగుతాయని.. అందుకే ప్రాంతీయ పార్టీలు, ఇతర శక్తులు పుంజుకోవాల్సిన అవసరం ఎంతై నా ఉందని చెప్పారు. ఆయన గురువారం సికింద్రాబాద్‌లోని హరిహరకళాభవన్‌లో సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ నార్త్‌జోన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆర్థిక సంక్షోభం - ప్రత్యామ్నాయాలు - లౌకికవాదం ప్రాధాన్యత’ సదస్సు, అలాగే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు.
గుజరాత్ సీఎం, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ రూపంలో మతతత్వ ప్రమాదం ముంచుకొస్తోందని, దాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. చిన్న రాష్ట్రాలుంటేనే తమ పని సులభమవుతుందని పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు కోరుకుంటున్నాయని తెలిపారు. సమైక్య రాష్ట్రం ఉన్నా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఎప్పటికీ ప్రజా సమస్యలు ఉంటాయని, వాటి కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత వామపక్షాల భుజాలపైనే ఉందని చెప్పారు. అందుకోసం వామపక్ష కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చా రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అక్కడి ప్రజల సమస్యలు మరింత తీవ్రమవుతాయని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న యూపీఏ
రాష్ట్ర విభజన అంశంపై జీవోఎం తలపెట్టిన అఖిలపక్ష సమావేశానికి కేవలం ఐదు పార్టీలనే పిలవాలనే నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీవీ రాఘవులు విమర్శించారు. సమైక్యాంధ్ర కోరుతున్నాయని సీపీఎం, వైఎస్‌ఆర్‌సీపీలను... నివేదిక ఇవ్వలేదని టీడీపీని అఖిల పక్షానికి పిలవకపోవడంపట్ల తీవ్ర అభ్యం తరం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు స్పష్టమైన వైఖరి చెప్పకుండా, మంత్రుల బృందానికి రెండు నివేదికలిచ్చిన కాం గ్రెస్ పార్టీని ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు పాటూరి రామయ్య, సంఘం జాతీయ నేత సునీత్ చోప్రా, త్రిపుర మంత్రి భానులాల్‌సాహు, సారంగధర పాశ్వాన్, సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ నార్త్‌జోన్ కమిటీ కార్యదర్శి డీజీ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.