రాజీవ్ గాంధీపై బీజేపీ ఎంపీ ప్రశంసలు
పట్నా: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రశంసలు కురిపించారు. నెహ్రూ కుటుంబంలో రాజీవ్ గాంధీ ఒక్కరే మంచి మనిషి అని కొనియాడారు. హిందువులను జాగృత పరచడానికి ఎంతో కృషి చేశారని మెచ్చుకున్నారు.
'కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించినప్పటికీ హిందువుల పౌరాణిక ధారవాహిక రామాయణంను దూరదర్శన్ లో ప్రసారం చేయడానికి రాజీవ్ గాంధీ అనుమతించారు. భక్తులు పూజలు చేసేందుకు అయోధ్యలోని రామాలయం తలుపులు తెరిపించార'ని పట్నాలో విలేకరులతో మాట్లాడుతూ స్వామి చెప్పారు.
మధ్యవర్తిత్వం ద్వారా బాబ్రీ మసీదు వివాదం పరిష్కారమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉందని, తాము అంత్యక్రియలు చేయనున్నామని వ్యాఖ్యానించారు.