'రాజీవ్ బతికుంటే రామ మందిరం నిర్మించేవారు'
ముంబై: 'రాజీవ్ గాంధీ బతికుంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేది. అప్పటివరకు వివాదంలో చిక్కుకుని ఉన్న ఆలయం తాళాలు తీయించింది రాజీవే. అంతేకాదు శిలాన్యాస్(పునాదిరాయి) ఉత్సవానికి కూడా ఆయన అనుమతి ఇచ్చారు. మందిర నిర్మాణం సజావుగా సాగేలా ముస్లిం పెద్దలతో రాజీవ్ చర్చించారు. సుప్రీంకోర్టులో జరిగిన వాదనలను సమగ్రంగా వినేవారు. ఆయన చనిపోకుండా ఉండుంటే మందిరం ఈపాటికి దేదీప్యమానంగా వెలుగుతుండేది' అంటూ రామమందిరంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి.
వీలుచిక్కినప్పుడల్లా నెహ్రూ, గాంధీ కుంటుంబంపై విరుచుకుపడే స్వామి ఈ సారి రాజీవ్ గాంధీపై ప్రశంసలు కురిపించడం, అదికూడా వివాదాస్పద అయోధ్య మందిరం నిర్మాణానికి రాజీవ్ కృషిచేశారనడం గమనార్హం. ఆదివారం ముంబైలో నిర్వహించిన 'అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎందుకు,ఎలా?' అనే సెమినార్ లో ప్రసంగించిన స్వామి.. రాజీవ్ గురించి తనకు బాగా తెలుసునని, ఆయన రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యేదుంటే మందిర నిర్మాణం తప్పక పూర్తి చేసి ఉండేవారని వ్యాఖ్యానించారు.
నిజానికి రాజీవ్ రామరాజ్య భావనను సమర్థించేవారు కాకపోయినప్పటికీ, సమస్య పరిష్కారం కోసం ముస్లిం నాయకులను ఒప్పించే ప్రయత్నం చేశారని స్వామి గుర్తుచేశారు. అంతిమంగా బాబ్రీ మసీదు కూల్చిన ప్రదేశంలోనే మందిర నిర్మాణానికి న్యాయస్థానం అనుమతి ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరికల్లా మందర నిర్మాణ పనులు మొదలవుతాయన్నారు. దేశంలో పాఠశాలలు,హాస్పిటల్స్,రోడ్లు,టాయిలెట్ల నిర్మాణం ముఖ్యమా? రామ మందిరం ముఖ్యమా? అన్న ప్రశ్నకు బదులిస్తూ మొదటిది ప్రభుత్వ బాధ్యత అని, నా పని మందిర నిర్మాణం కోసం కృషి చేయడమని చెప్పారు.