సంచలనం రేపుతున్న ఎన్ఎస్డీసీ ఛైర్మన్ రాజీనామా
న్యూఢిల్లీ: నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) అండ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఏజన్సీ చీఫ్ పదవికి ఎస్ రామదొరై (71) రాజీనామా చేశారు. అనారోగ్యకారణాల రీత్యా ఆయన సంస్థ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. దీంతో కొత్త నియామకం చేపట్టేంతవరకు స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఆంట్ర పెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ గవర్నింగ్ బాడీ మరియు సెక్రటరీ, వైస్ చైర్మన్ రోహిత్ నందన్ ఛైర్మన్ పదిలో కొనసాగనున్నారు. దీంతోపాటు దొరై రాజీనామాతో భవిష్యత్తుల రోడ్ మ్యాప్ పై చర్చించడానికి రేపు ఎన్ఎస్డీసీ సమావేశం కానుంది. ఒకవైపు టాటా రచ్చెకెక్కిన బోర్డ్ రూం వ్యవహారంలో విమర్శలు కొనసాగుతుండగానే, మరోవైపు ప్రభుత్వంలో కీలక అధికారిగా ఉన్న టాటా గ్రూపు మాజీ అధికారి రాజీనామా అంశం సంచలనంగా మారింది.
మరోవైపు కొత్త చైర్మన్ ఎంపిక కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిందని మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఆయన రాజీనామాను ప్రధాన మంత్రి అంగీకరించారని తెలిపాయి. అయితే ఈ రాజీనామా వార్తలపై దొరై ఇంకా స్పందించాల్సి ఉంది.
కాగా యూపీఏ ప్రభుత్వం నియమించిన ఎన్ఎస్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో దిలీప్ చెనోయ్, సీఓఓ అతుల్ భట్నాగర్ గతేడాది రాజీనామా చేశారు. కేబినెట్ హోదాలో మే 2013 లో దొరై ఎన్ఎస్డీసీ చైర్మన్ గా నిమితులయ్యారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మాజీ వైస్ చైర్మన్ గా ఆయన టాటా గ్రూపునకు సేవలందించారు. గతంలో కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ ఎన్ఎస్డీసీ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.