
రాష్ట్రపతి భవన్‌లో సైనిక కవాతు రద్దు
రామ్‌నాథ్ కోవింద్ రాక సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ఏళ్లుగా కొనసాగుతోన్న సంప్రదాయానికి తాత్కాలిక బ్రేక్ పడింది.
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి అధికారిక నివాసం రాష్ట్రపతి భవన్‌లో ఏళ్లుగా కొనసాగుతోన్న సంప్రదాయానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ప్రతి శనివారం ఎంతో ఘనంగా నిర్వహించే సైనిక కవాతు(ఛేంజ్ ఆఫ్ గార్డ్స్) వేడుకను.. తాత్కాలికంగా రద్దు చేసినట్లు భవన్ అధికారులు శుక్రవారం ఓక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్ బాధ్యతల స్వీకార కార్యక్రమం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
‘శనివారం(జులై 22న) జరగాల్సిన ఛేంజ్ ఆఫ్ గార్డ్స్ వేడుకను రద్దయింది. మంగళవారం(జులై 25న) నూతన రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ప్రెసిడెంట్స్ బాడీగార్డ్స్ సమాయత్తం అవుతున్నారు. ప్రస్తుతం ఫుల్‌డ్రెస్ రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ కారణంగానే శనివారం జరగాల్సిన కవాతు వేడుకను రద్దు చేస్తున్నాం’ అని రాష్ట్రపతి భవన్ మీడియా కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.
ఏమిటీ ఛేంజ్ ఆఫ్ గార్డ్స్?
స్వాతంత్ర్యానికి పూర్వం నుంచీ కొనసాగుతూ వస్తోన్న ప్రెసిడెంట్స్ బాడీగార్డ్(పీబీజీ).. ఇండియన్ ఆర్మీలోని సీనియర్‌మోస్ట్ రెజిమెంట్లలో ఒకటిగా పేరుపొందింది. భవన్‌లో విధులు నిర్వహించే ఈ పీబీజీ సిబ్బంది వారానికి ఒకసారి(శనివారం నాడు) మారుతూఉంటారు. డ్యూటీ దిగిపోయేవారు, కొత్తగా డ్యూటీలో చేరేవారు కవాతు చూస్తూ బాధ్యతలు మార్చుకుంటారు. దీనినే ‘ఛేంజ్ ఆఫ్ గార్డ్స్’గా పిలుస్తారు.
2007 నుంచి సందర్శకులకు అనుమతి
ఛేంజ్ ఆఫ్ గాడ్స్ కార్యక్రమం ఏళ్లుగా కొనసాగుతున్నా.. సందర్శకులు చూసేందుకు అవకాశం కల్పించింది మాత్రం 2007 నుంచే! సైనిక వాద్యబృందాలు.. ఏఆర్ రెహమాన్ స్వరపర్చిన పాపులర్ దేశభక్తి గీతం ‘మా తుఝే సలాం..’ను మోగిస్తుండగా, వరుసగా వచ్చే సైనిక, అశ్వదళాలు, కొత్తవారికి బాధ్యలు అప్పగించడం తదితర దృశ్యాలు ఆకట్టుకుంటాయి.