బెస్ట్ 'అన్ లిమిటెడ్ డేటా' ఆఫర్లేమిటో తెలుసా?
బెస్ట్ 'అన్ లిమిటెడ్ డేటా' ఆఫర్లేమిటో తెలుసా?
Published Wed, Mar 8 2017 11:55 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM
సంచలన ఆఫర్లతో రిలయన్స్ జియో టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో టెలికాం దిగ్గజాలు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ లన్నీ ఒక్కసారిగా రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. ఇక ఏప్రిల్ 1 నుంచి రిలయన్స్ జియో తన ఉచిత ఆఫర్లకు స్వస్తి చెప్పి, ఛార్జీల విధింపుకు సిద్ధమైంది. అయినప్పటికీ కంపెనీలు మాత్రం తన కస్టమర్లను ఆకట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వారికి కౌంటర్ గా జియో కూడా బెస్ట్ డీల్స్ నే ప్రకటిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో అందిస్తున్న బెస్ట్ అన్ లిమిటెడ్ డేటా ఆఫర్లేమున్నాయో ఓ సారి చూద్దాం...
రిలయన్స్ జియో ప్రైమ్ సబ్స్క్రిప్షన్+రూ.303 రీఛార్జ్ ప్యాక్:
రిలయన్స్ జియో తన ప్రైమ్ కస్టమర్లకు రూ.303 ప్రీపెయిడ్ రీఛార్జ్ తో 28జీబీ 4జీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ డేటా 28 రోజుల వరకు వాలిడిటీలో ఉండనుంది. జియో ప్రైమ్ పోస్ట్ పెయిడ్ యూజర్లకైతే, ఇదే ధర కింద 30జీబీ డేటాను కంపెనీ అందించనుంది. ఈ ప్లాన్ కింద కస్టమర్లు రూ.99 జియో ప్రైమ్ ప్లాన్ ను సబ్ స్క్రైబ్ చేసుకుంటే, రోజుకు 1జీబీ 4జీ డేటా కూడా పొందవచ్చు. దాంతో పాటు అపరిమిత ఉచిత కాల్స్. 1జీబీ డేటా సరిపోదనుకునే ప్రీపెయిడ్ యూజర్లు రూ. 499 జియో ప్రైమ్ రీఛార్జ్ ప్యాక్ ను వేసుకుంటే 56జీబీ డేటాను పొందవచ్చు. రోజుకు 2జీబీ వాడుకోవచ్చు. ఇదే బిల్లింగ్ సైకిల్ కింద పోస్ట్ పెయిడ్ కస్టమర్లైతే 60జీబీ 4జీ డేటాను పొందవచ్చని కంపెనీ తెలిపిన సంగతి తెలిసిందే.
ఎయిర్ టెల్ రూ.345 రీఛార్జ్ ప్యాక్:
రూ.345 తో రీఛార్జ్ చేసుకునే ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు 28 రోజుల వరకు 28జీబీ హై-స్పీడ్ డేటాను వాడుకోవచ్చు. అదేవిధంగా డైలీ ఎఫ్యూపీ కింద 1జీబీ పొందవచ్చు. రోజంతా 500 ఎంబీని వాడుకొని, అర్థరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు మరో 500 ఎంబీని వాడుకునేలా ఎయిర్ టెల్ ఈ ఆఫర్ ను అందిస్తోంది. ఒకవేళ ఎలాంటి టైమింగ్ నిబంధనలు లేకుండా రోజంతా 1జీబీ వాడుకోవాలనుకునే వారు రూ.549 రీఛార్జ్ ప్యాక్ ను వేసుకోవాల్సి ఉంటుంది.
రూ.345, రూ.549 రీఛార్జ్ ప్యాక్ లపై ఉచిత కాల్స్ ను కూడా పొందవచ్చు. కానీ షరతులు వర్తిస్తాయి. 1200 నిమిషాలకు పైగా కాల్స్ ను వాడుకునే వారికి నిమిషానికి 30పైసల ఛార్జ్ పడుతుంది. 30 పైసల ఛార్జ్ వేసిన తర్వాత ఎయిర్ టెల్ రోజుకు 300 నిమిషాల ఉచిత కాల్స్ ను అందిస్తోంది. అటు పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ఎయిర్ టెల్ మార్చి 13 నుంచి ఉచిత డేటా అందించనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. కానీ ఎంత మేరకు ఉచిత డేటా అందిస్తోందో తెలుపలేదు. అయితే ఈ ఉచిత డేటాను పొందాలంటే మైఎయిర్ టెల్ యాప్ ను సబ్ స్క్రైబర్లు ఓపెన్ చేసుకోవాలని సూచించింది.
వొడాఫోన్ రూ.346 రీఛార్జ్ ప్యాక్ :
రూ.346 రీఛార్జ్ ప్యాక్ ను లాంచ్ చేసిన వొడాఫోన్ 28జీబీ మొబైల్ డేటాను, అపరిమిత ఉచిత కాల్స్ ను అందించనున్నట్టు తెలిపింది. ప్రత్యర్థుల మాదిరిగానే రోజూ 1జీబీ ఉచిత డేటాను వాడుకునే అవకాశం కల్పించిన వొడాఫోన్, అంతకంటే ఎక్కువ వాడితే ఛార్జ్ చేయనున్నట్టు పేర్కొంది.
ఐడియా రూ.348 రీఛార్జ్ ప్యాక్ :
ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లు కూడా రూ.348 రీఛార్జ్ తో 14జీబీ ఉచిత డేటా, రోజుకు 500 ఎంబీ డేటాను వాడుకునే అవకాశాన్ని పొందనున్నారు. వీటితో పాటు అపరిమిత కాల్స్ ను పొందవచ్చు. 4జీ హ్యాండ్ సెట్ ఉన్న వారికి మాత్రమే ఈ కొత్త ఆఫర్ సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది.
Advertisement
Advertisement