‘ప్రాణహిత’కు దారేదీ? | Reservoirs In the steam losses higher cost of lift irrigation Waste? | Sakshi
Sakshi News home page

‘ప్రాణహిత’కు దారేదీ?

Published Sat, Sep 26 2015 1:20 AM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM

‘ప్రాణహిత’కు దారేదీ?

‘ప్రాణహిత’కు దారేదీ?

‘కాకతీయ’ నుంచి ఎస్సారెస్పీకి నీటి మళ్లింపుపై భిన్నాభిప్రాయాలు
ప్యాకేజీ 7 నుంచి ‘ఎస్సారెస్పీ’కి నీరివ్వాలంటున్న నిపుణులు
ఆ నీటికి సమానంగా ఎస్సారెస్పీ నీటిని తీసుకోవాలని సూచన
అలా అయితేనే ప్రాజెక్టు వ్యయ భారం తగ్గుతుందని వెల్లడి
తడ్కపల్లి, పాములపర్తి రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు పెను భారమే!
రిజర్వాయర్లలో ఆవిరి నష్టాలు ఎక్కువైతే ఎత్తిపోతల ఖర్చు వృథా?


సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు జరుగుతుండగా తాజాగా ప్రాజెక్టు కింద నిర్ణయించిన ఆయకట్టుకు ఎటు నుంచి నీళ్లివ్వాలన్న అంశం కొత్త చర్చకు తెరలేపింది. ప్రాజెక్టు పాత డిజైన్ మేరకే ఎస్సారెస్పీ పరిధిలోని ఆయకట్టుకు ప్రాణహిత నీటిని ఇవ్వాలని, దానికి ప్రతిగా ప్రాణహిత పరిధి ఆయకట్టుకు ఎస్సారెస్పీ నీటిని మళ్లించాలని ఇంజనీరింగ్ నిపుణులు సూచించినా ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తుండటం ప్రాజెక్టు వ్యయంపై పెను భారం మోపనుంది.
 
పాత డిజైనే హితం..!
పాత డిజైన్ మేరకు మేడారం నుంచి మొదలయ్యే ప్యాకేజీ 7లో ఉన్న కాకతీయ కెనాల్ క్రాసింగ్ నుంచి దిగువన ఉన్న ఎస్సారెస్పీ ఆయకట్టుకు ప్రాణహిత నీటి నే ఇవ్వాల్సి ఉంటుంది. 32 టీఎంసీల మేర ప్రాణహిత నీటిని ఎస్సారెస్పీ ఆయకట్టుకు మళ్లించేలా దీన్ని డిజైన్ చేశారు. ఇక్కడ మళ్లిస్తున్న నీటికిబదులుగా అంతే పరిమాణంలో నీటిని ఎస్పారెస్పీ నుంచి తీసుకొని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రాణహిత 20, 21, 22, 27,  28 ప్యాకేజీల్లో ఉన్న 2.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు మళ్లిస్తూ సమతూకం చేసేలా ప్రణాళిక వేశారు.

ఎస్సారెస్పీ దిగువ ఆయకట్టుకు ఏటా ఆగస్టు చివరి వారం వరకు నీళ్లిచ్చే పరిస్థితులు లేక పంటల సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే ప్రాణహిత నీటిని మళ్లిస్తే అక్కడ జూన్, జూలైల్లోనే నీటిని ఇవ్వగలగడంతోపాటు 120 కి.మీ. దూరాన ఉన్న నిజామాబాద్ ఆయకట్టుకు ప్రాణహిత నీటిని మళ్లించడం శ్రమ, ఖర్చుతో కూడుకున్న కారణంతో ఈ డిజైన్ రూపొందించారు.

అయితే ప్రాణహిత నీటిని మిడ్‌మానేరుకు తేగలుకుతున్నట్లే లోయర్ మానేరు డ్యామ్‌కు కూడా నీటినితెస్తే ప్యాకేజీ 7 అవసరం లేదన్న ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా తడ్కపల్లి, పాములపర్తి రిజర్వాయర్‌ల సామర్థ్యాన్ని పెంచి హల్దీవాగు, మంజీరా వాగుల నుంచి గ్రావిటీ ద్వారా నిజామాబాద్‌కు నీళ్లిస్తామని చెబుతోంది. అయితే తడ్కపల్లి, పాములపర్తికి నీటిని ఎత్తిపోసేందుకు వేల కోట్లు ఖర్చవుతుందని, కరెంట్ ఖర్చు, ముంపూ భారీగానే ఉంటుందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ చెబుతున్నారు.
 
ఎత్తిపోతలకు భారీ ఖర్చు...
టీఎంసీ సామర్ధ్యం ఉన్న పాములపర్తి రిజర్వాయర్‌ను 20 టీఎంసీలకు, తడ్కపల్లిని 50 టీఎంసీలకు పెంచేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి 510 మీటర్ల ఎత్తులో ఉన్న తడ్కపల్లికి టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకు 50 మిలియన్ యూనిట్ల ఖర్చవుతుంది. యూనిట్‌కు రూ.5 మేర లెక్కించినా టీఎంసీ నీటికే రూ. 25 కోట్ల ఖర్చవుతుంది. 50 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు ఏటా సుమారు రూ. 1,250 కోట్లు ఖర్చు కానుంది.

600 మీటర్ల ఎత్తునున్న పాములపర్తికి నీటిని ఎత్తిపోసేందుకు టీఎంసీకి 60 మిలియన్ యూనిట్‌ల చొప్పున రూ. 30 కోట్ల వరకు ఖర్చవుతుంది. అంటే 20 టీఎంసీలకు రూ. 600 కోట్ల మేర ఖర్చుంటుంది. రిజర్వాయర్‌లలో 50 టీఎంసీల మేర నీటి నిల్వ చేస్తే అందులో 15 శాతం ఆవిరి నష్టాలు ఉంటాయి. అంటే ఒక్క తడ్కపల్లిలో ఏటా 7.5 టీఎంసీల మేర ఆవిరైతే, వాటిని ఎత్తిపోసేందుకు ఖర్చయ్యే రూ.175 కోట్లు ఏటా వృథాగా పోయినట్లే.

అదీగాక తడ్కపల్లి, పాములపర్తి నుంచి నీటిని నిజాంసాగర్‌కు తరలిస్తే ప్రతి టీఎంసీలో 0.50 టీఎంసీ ఆవిరి, ఇతర నష్టాలుంటాయి. ఇక ప్యాకేజీ 7 నుంచి లోయర్ మానేరు డ్యామ్‌కు నీటిని తరలిస్తే అక్కడా ప్రతి టీఎంసీకి 4 మిలియన్ యూనిట్ల ఖర్చు జరిగే అవకాశం ఉండగా మొత్తంమీద 32 టీఎంసీలకు భారీ ఖర్చయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొంటే పాత డిజైనే మేలని ఇంజనీర్లు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement