మంత్రిగారి ఆస్తులు ఎటాచ్!
మంత్రిగారి ఆస్తులు ఎటాచ్!
Published Sat, Mar 4 2017 11:12 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM
ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ఆస్తులను ఆదాయపన్ను శాఖ అధికారులు ఎటాచ్ చేశారు. దేశ రాజధానిలో ఆయనకు ఉన్న దాదాపు 40 ఎకరాల బూమితో పాటు పలు కంపెనీలలో ఉన్న షేర్లను కూడా ఎటాచ్ చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి మధ్య వార్ మరింత ముదిరింది. భూమి రిజిస్ట్రేషన్ విలువ దాదాపు రూ. 17 కోట్లు, షేర్ల విలువ రూ. 16 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మార్కెట్ విలువ ఇంకా ఎక్కువేనంటున్నారు. ఇండో మెటల్ఇంపెక్స్, అకించన్ డెవలపర్స్, ప్రయాస్ ఇన్ఫోసొల్యూషన్స్, మంగల్యతన్ ప్రాజెక్ట్స్ కంపెనీలలో ఉన్న షేర్లను కూడా ఎటాచ్ చేశారు. ఈ కంపెనీలకు సత్యేంద్ర జైన్ నగదు రూపంలో చెల్లింపులు చేసి, షేర్ల కొనుగోలుకు అక్రమంగా బుక్ ఎంట్రీలు చేయించుకుంటున్నారని పన్ను అధికారులు ఆరోపించారు.
ఇండోమెటల్ఇంపెక్స్‌కు చెందిన మరికొంత భూమిని కూడా ఎటాచ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలో అత్యంత శక్తిమంతులైన మంత్రులలో సత్యేంద్ర జైన్ ఒకరు. ఆయనకు ఆరోగ్యం, రవాణా, పీడబ్ల్యుడీ లాంటి కీలక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఆదాయపన్ను శాఖ చర్యలపై సత్యేంద్ర జైన్‌ను మీడియా ప్రశ్నించగా, ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ప్రాథమికంగా 90 రోజుల పాటు ఈ ఎటాచ్‌మెంట్ ఉంటుంది. బినామీ లావాదేవీలతో సంపాదించిన సొమ్ముతోనే ఈ ఆస్తులన్నింటినీ సేకరించారని ఆదాయపన్ను శాఖ తెలిపింది. ఆదాయాన్ని దాచిపెట్టినందుకు మంత్రిపై ప్రత్యేకంగా దర్యాప్తు జరుగుతోంది. కోల్‌కతాకు చెందిన బడా ఆపరేటర్లు జీవేంద్ర మిశ్రా, అభిషేక్ చొఖానీ, రాజేంద్ర బన్సల్ తదితరులతో సత్యేంద్ర జైన్‌కు సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. వీళ్లు నగదు తీసుకుని కేవలం కాగితాల మీదే ఉన్న కంపెనీల షేర్లను ఎక్కువ ధరలకు ఇస్తారు. ఆ షేర్ల రూపంలో వాళ్ల డబ్బంతా తెల్లధనం అయిపోతుంది.
Advertisement
Advertisement