విశ్లేషకులకూ రూల్స్: సెబీ
ముంబై: లిస్టెడ్ కంపెనీలు, షేర్ల గురించి స్వతంత్ర నివేదికలు ఇస్తూ, గందరగోళం సృష్టిస్తున్న రీసెర్చ్ అనలిస్టులను నియంత్రించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నడుం కట్టింది. ఇందులో భాగంగా విశ్లేషకుల సర్వీసులకు సంబంధించి మార్గదర్శకాల ముసాయిదాను రూపొందించింది. వీటిప్రకారం భారతీయ కంపెనీలపై రీసెర్చ్ సేవలు అందించాలనుకునే విదేశీ సంస్థలు కచ్చితంగా భారత్‌లో అనుబంధ సంస్థను కలిగి ఉండాలి. దాని ద్వారా తప్పనిసరిగా రిజిస్టరు చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేనిదే ఏ వ్యక్తి కూడా రీసెర్చ్ అనలిస్టుగా వ్యవహరించడానికి వీల్లేదు. విశ్లేషకులను కూడా నియంత్రణ పరిధిలోకి తేవాలంటూ ది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ కమిషన్స్ (ఐవోఎస్‌సీవో) చేసిన సూచనల మేరకు సెబీ ఈ ముసాయిదా రూపొందించింది. వీటిపై సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను డిసెంబర్ 21లోగా తెలియజేయాల్సి ఉంటుంది