
రూపాయిని రక్షించలేరా?
న్యూఢిల్లీ: ఒకపక్క రూపాయి విలువ రికార్డు స్థాయి లో క్షీణించడం, మరోవైపు ద్రవ్యలోటు పెరిగిపోతుందనే ఆందోళనల నేపథ్యంలో బుధవారం విపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఏకంగా.. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఏం చేయాలో పాలుపోని కేంద్రం గద్దె దిగాలని డిమాండ్ చేసింది. మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వెంటనే అధికారం నుంచి వైదొలగి తాజాగా ఎన్నికలకు వెళితేనే ఇటు రూపాయి కానీ అటు మార్కెట్ కానీ స్థిరత్వాన్ని సంతరించుకుంటాయని బీజేపీ నేత, మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా అన్నారు.
ఈ పరిస్థితుల్లో ఇదొక్కటే మార్గమని ఎద్దేవా చేశారు. ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం పూర్తిగా పట్టుకోల్పోయిందని విమర్శించారు. ‘వాళ్లు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. స్టాక్ మార్కెట్ సులువుగా పడిపోతోంది. రూపాయి నిరాటంకంగా క్షీణిస్తోంది..’ అని అన్నారు. ప్రధానికి పదవిలో కొనసాగే అర్హత లేదని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ అన్నారు. ‘మన్మోహన్ నేతృత్వంలోని భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంది. భారీ కరెంటు అకౌంట్ లోటు, ద్రవ్య లోటు కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పాలనా వ్యవస్థపై పెట్టుబడిదారులు పూర్తిగా విశ్వాసం కోల్పోయారు’ అని రాజ్యసభలో ఉప ప్రతిపక్ష నేత రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆర్థికవేత్త అయిన ప్రధానే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఆహార భద్రత’ దృష్ట్యా భారీగా పెరుగుతున్న ఆర్థికవ్యయా న్ని ప్రస్తావిస్తూ.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యపూరిత వ్యయానికి, ప్రజాకర్షక చర్యలకు పాల్పడుతోందన్నారు.
వామపక్షాలు సైతం సర్కారు విధానాలను తూర్పారబట్టాయి. ఆర్థిక అత్యవసర పరిస్థితి దిశగా దేశం పయనిస్తోందని సీపీఐ నేత గురుదాస్ దాస్‌గుప్తా అన్నారు. పన్ను రాయితీలతో ధనికులకు ఇస్తున్న ప్రోత్సాహకాలను నిలిపివేయడమే తక్షణ ఆవశ్యకతగా సీపీఎం నేత సీతారాం ఏచూరి పేర్కొన్నారు.