రష్యా నమ్మకమైన నేస్తం!
మాస్కో: మేకిన్ ఇండియాలో భాగంగా భారత్‌లో కమోవ్-226 యుద్ధ హెలికాప్టర్ల తయారీకి రష్యా పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశవ్యాప్తంగా 12 అణువిద్యుదుత్పత్తికి రియాక్టర్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. ప్రధాని మోదీ రెండ్రోజుల రష్యా పర్యటన సందర్భంగా జరిగిన ఇండో-రష్యా శిఖరాగ్ర సదస్సులో ఇరుదేశాల మధ్య బంధం బలపడే దిశగా మొత్తం 16 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం దృష్టిలో ఉంచుకుని రక్షణ, అణుశక్తితోపాటు ఆర్థిక రంగంలోనూ పరస్పరం సహకారం చేసుకోవాలని నిర్ణయించారు.
మాస్కోలోని క్రెమ్లిన్ భవనంలో జరిగిన ఈ సదస్సులో మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు ఇరుదేశాలకు చెందిన పలువురు అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించటంపై తమ పూర్తి మద్దతుంటుందని ఈ సందర్భంగా పుతిన్ తెలిపారు. ఉగ్రవాదంపై పోరు విషయంలో ప్రపంచమంతా ఏకమవ్వాల్సిన అవసరం ఉందని సంయుక్త మీడియా సమావేశంలో మోదీ పేర్కొన్నారు.
రష్యాలో చమురు, గ్యాస్ నిక్షేపాల వెలికితీతలో భారత కంపెనీలకు అవకాశం ఇచ్చేందుకు కూడా పుతిన్ అంగీకరించారు. ప్రస్తుతం పది బిలియన్ డాలర్ల (రూ.66 వేల కోట్ల) ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతుండగా.. వచ్చే పదేళ్లలో దీన్ని 30 బిలియన్ డాలర్లకు (రూ.1.98 లక్షల కోట్లు) పెంచాలని నిర్ణయించారు. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న రష్యా.. ఆర్థికంగా బలపడేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా.. భారత్‌తో రక్షణ, ఆర్థిక సహకారంపైనా చర్చలు జరిపారు.
అటు భారత్ కూడా ‘యురేషియా’ ఆర్థిక జోన్ పరిధిలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం పట్టుబడుతోంది. గతవారం భారత రక్షణ శాఖ రష్యానుంచి రూ.40 వేల కోట్లతో ‘ఎస్-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ వ్యవస్థ’ను కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. కాగా, సమావేశం జరిగిన తీరుపై మోదీ, పుతిన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య అభివృద్ధితోపాటు అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థిక, మానవీయ విషయాల్లో మరింత బలమైన బంధాలకు సదస్సు దోహద పడుతుందని సంయుక్త ప్రకటనలో ఇరువురు నేతలు తెలిపారు.
తమ భేటీ ఫలప్రదంగా జరిగిందని మోదీ ట్వీట్ చేశారు. మంచిరోజుల్లో, చెడ్డ రోజుల్లో రష్యా భారత్‌కు నమ్మకమైన నేస్తంగా ఉన్నదని మోదీ అన్నారు. రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందాలతో.. భారత తయారీ రంగం మరింత వేగం అందుకుంటుందన్నారు. అంతకుముందు క్రెమ్లిన్‌లోని అలెగ్జాండర్ గార్డెన్లో ఉన్న రెండో ప్రపంచయుద్ధ అమరవీరులకు పుష్పాంజలి అర్పించారు.
తర్వాత రష్యా ప్రభుత్వం ఆధీనంలో నడిచే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌సీఎంసీ)ని ప్రధాని మోదీ గురువారం సందర్శించారు. అరగంటసేపు ఈ కేంద్రాన్ని సందర్శించి.. అక్కడి సిబ్బందితో వ్యవస్థ పనితీరును అడిగి తెలుసుకున్నారు. బుధవారం రాత్రి మోదీతో ప్రత్యేకంగా భేటీ అయిన పుతిన్.. ఆయన ఇచ్చిన విందును స్వీకరించారు. మోదీతో భేటీ సందర్భంగా బెంగాల్‌కు చెందిన 18వ శతాబ్దం నాటి ఖడ్గం, మహాత్మాగాంధీ డైరీలోని ఓ పేజీ (చేతిరాత)ని పుతిన్ మోదీకి బహూకరించారు.
భారత విదేశాంగ నీతి బాధ్యతాయుతమైనదన్న నితిన్.. ప్రపంచం ఎదుర్కుంటున్న చాలా సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం చూపించే స్థానంలో భారత్‌ను చూడాలనుకుంటున్నట్లు తెలిపారు. సిరియాలో జరిగిన రష్యా విమాన ప్రమాద మృతులకు మోదీ సంతాపం తెలిపారు. కాగా, రష్యా పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ భారత్‌కు బయల్దేరారు. శుక్రవారం ఉదయం చేరుకోనున్నారు.
రష్యాతో కుదుర్చుకున్న 16 ఒప్పందాలు
* పౌరుల విమాన ప్రయాణాల విషయం లో పరస్పరం నిబంధనల సరళీకరణ.
* అధికారులు, దౌత్యవేత్తల పాస్‌పోర్టులున్న వారికి ఇరుదేశాల్లో పరస్పరం ప్రయాణించే సౌకర్యం.
* హెలికాప్టర్ ఇంజనీరింగ్‌రంగంలో సహకారం.
* 2015-17 మధ్య కస్టమ్స్ ఎగవేత నియంత్రణలో సహకారం.
* భారత్‌లో 12 రష్యా తయారీ అణురియాక్టర్ల ఏర్పాటు (ఏపీతో సహా).
* రైల్వే రంగంలో సాంకేతిక సహకారం.
* భారత్‌లో సౌరశక్తి ప్లాంట్ల నిర్మాణంలో సహకారం.
* రాంచీలోని హెచ్‌ఈసీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెవీ ఇంజనీరింగ్ అభివృద్ధికి ఒప్పందం.
* హెచ్‌ఈసీ తయారీ సామర్థ్యాన్ని పెంచ టం, నూతనీకరించేందుకు ఒప్పందం
* ప్రసార రంగంలో సహకారం.
* సీ-డాక్, ఐఐఎస్‌సీ (బెంగళూరు), లోమొనోసోవ్ మాస్కో స్టేట్ వర్సిటీ మధ్య ఒప్పందం.
* సీ-డాక్, ఓజేఎస్‌సీ, గ్లోనాస్ యూనియన్ మధ్య ఒప్పందం.
* రష్యాలోని తూర్పు ప్రాంతంలో పెట్టుబడులకు సహకారం.
* హైడ్రోకార్బన్ల ఉత్పత్తి, అన్వేషణ, జియోలాజికల్ సర్వేలో సహకారానికి (రష్యా భూభాగంపై) ఒప్పందం.
* జేఎస్‌సీ వాంకోర్‌నెఫ్ట్‌లో సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టులో తొలివిడత పనులు పూర్తయినట్లు ధృవీకరణ.
* హైడ్రోకార్బన్ల ఉత్పత్తి, అన్వేషణ, జియోలాజికల్ సర్వేలో సహకారానికి(భారత భూభాగంపై) ఒప్పందం.