
'రేప్' వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇచ్చినా..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు వివాదాలు కొత్త కాదు. బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్న ఈ సూపర్ స్టార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. రేప్ గురైన మహిళగా తనను తాను పోల్చుకుంటూ సల్మాన్ చేసిన వ్యాఖ్యలపై దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. బజరంగీ భాయ్ జాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై సల్మాన్ తండ్రి సలీంఖాన్ కొడుకు తరఫున క్షమాపణలు కూడా చెప్పారు.
అయితే, సల్మాన్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే నాలుక కరుచుకున్నారు. ఆలి అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో మల్లయుద్ధం క్రీడ నేపథ్యంతో సల్మాన్ 'సుల్తాన్' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ప్రతిరోజు ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేసరికి తన ఒళ్లు హూనం అయ్యేదని, షూటింగ్ ముగిసేసరికి తన పరిస్థితి అత్యాచారానికి గురైన మహిళలా మారేదని సల్మాన్ ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో పేర్కొన్నాడు. 'దాదాపు ఆరు గంటలపాటు కొనసాగే షూటింగ్ సందర్భంగా మైదానంలో ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ప్రత్యర్థి నటుడిని ఎత్తి కిందపడేయాల్సి వచ్చేది. ఒక వ్యక్తిని ఎత్తాల్సి ఉంటే.. పదికోణాల్లో చూపించేందుకు అతన్ని పదిసార్లు ఎత్తుకోవాల్సి వచ్చేది. ఇదెంతో కష్టంగా అనిపించేది. ఎన్నోసార్లు మైదానం నుంచి నన్ను ఎత్తి బయటకు పడేశారు.
నిజమైన రింగ్ లో ఇలా రిపీటెడ్ యాక్షన్స్ ఉండవు. షూటింగ్ అయిపోయాక రింగ్ నుంచి బయటకు వస్తుంటే నా పరిస్థితి రేప్ కు గురైన మహిళలా ఉండేది. కనీసం నిటారుగా నడవటానికి కూడా వీలుపడేది కాదు' అంటూ సల్మాన్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై విలేకరులు గట్టిగా అడగటంతో సల్మాన్ వెంటనే నాలుక కరుచుకున్నాడు. తాను అలాంటి పోలిక చేయాల్సింది కాదని అదే విలేకరుల సమావేశంలో సల్మాన్ వివరణ కూడా ఇచ్చాడు. కానీ ఆయన ఇచ్చిన వివరణ అంతగా ఫోకస్ కాలేదు. సల్మాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై సల్మాన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని జాతీయ మహిళా కమిషన్ చీఫ్ లలితా కుమారమంగళం డిమాండ్ చేశారు.