సాక్షి, విజయవాడ: మనకోసం, రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం నిలిచిన వారికిఅండగా నిలబడాల్సిన అవసరం ఉందని, పార్లమెంట్‌లో తెలంగాణ కోసం బిల్లు పెట్టిన వారిని, సహకరించిన వారిని ఓడిద్దామని సమైక్యవాదులు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు పార్లమెంట్‌ను వదిలి వస్తే ఢిల్లీ పీఠం కదులుతుందన్నారు. ముఖ్యమంత్రి కూడా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని ఏఎస్ రామారావు హాలులో సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన చైతన్యపథం ‘ఎవరెటు’ చర్చావేదిక కార్యక్రమానికి సమైక్యవాదులు పెద్దఎత్తున తరలివచ్చారు. ‘వైఎస్ కుటుంబం మొత్తం ప్రజల కోసం పాటుపడుతోంది. ఈ వయసులో కూడా రాష్ట్ర సమైక్యం కోసం విజయమ్మ దీక్ష చేస్తున్నారు.
వారికి కోటి వందనాలు’ అని చెప్పారు. మునిసిపల్ ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్ డి.ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరగడానికి కారణం వైఎస్ రాజశేఖరరెడ్డి అని దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. ఆనాడు వైఎస్ అసెంబ్లీ సాక్షిగా ఒక సమస్య పరిష్కరించేటప్పుడు మరో కొత్త సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలని చెప్పారని, దీన్ని ప్రభుత్వం ఎందుకు గమనంలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. సోనియాగాంధీ.. రాహుల్‌ను ప్రధానమంత్రిని చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.
హెల్త్ యూనివర్శిటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.నరసింహరావు మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులన్నీ రాజధానిలోనే ఉన్నందున రాష్ట్రం విడిపోతే ఆరోగ్యశ్రీ కార్డులు చెత్తబుట్టలో వేయడానికి తప్ప ఎందుకూ పనికిరావన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు పి.వి.లక్ష్మణరావు మాట్లాడుతూ ఒకప్పుడు మనలో భాగంగా ఉండి, పాలనా సౌలభ్యం కోసం ఖమ్మంలో కలిసి, ఏ మాత్రం ఆదాయం రాని వెనుకబడిన భద్రాచలం ప్రాంతాన్నే వదులుకోవడానికి తెలంగాణవాదులు సిద్దంగా లేరని, అటువంటిది లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన హైదరాబాద్‌ను ఎలా వదులుకుంటామని ప్రశ్నించారు.
ప్రముఖ న్యాయవాది జగదీశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ నిర్ణయాన్ని కేంద్రం ద్వారా ప్రజలపై రుద్దితే సహించబోమని హెచ్చరించారు. కృష్ణాజిల్లా రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శి కోటంరాజు మాట్లాడుతూ వ్యవసాయం చేసేది ఇక్కడైతే ఎన్జీ రంగా యూనివర్శిటీ హైదరాబాద్‌లో ఉందని, కోస్తా తీరం ఇక్కడ ఉంటే వాతావరణ కేంద్రం హైదరాబాద్‌లో ఉందని చెప్పారు. 240 ప్రభుత్వరంగ సంస్థలు, 21 యూనివర్శిటీలు రాజధానిలో ఉన్నాయని చెప్పారు. విభజనపై సోనియా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.