
పటేల్ ప్రధాని అయ్యుంటే !
దేశ ముఖచిత్రం మరోలా ఉండేది
పటేల్ సాధించిన ఐక్యత, సమగ్రతలు ఇప్పుడు తీవ్రవాదం, ఉగ్రవాదం వల్ల ప్రమాదంలో పడ్డాయి
- నరేంద్ర మోడీ
పటేల్ అన్ని సిద్ధాంతాలను గౌరవించారు. పేదలను అభిమానించేవారు. ఆ లక్షణాలే ఇప్పుడు
దేశంలో మృగ్యమయ్యాయి -మన్మోహన్
అహ్మదాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసత్వాన్ని అందిపుచ్చుకునే విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీ పడుతున్నాయి. ఆ విషయంపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ల మధ్య మంగళవారం ఒకే వేదికపై నుంచి మాటల యుద్ధం జరిగింది. అహ్మదాబాద్‌లో సర్దార్ పటేల్ పేరుతో ఏర్పాటు చేసిన ఒక మ్యూజియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఈ మాటల యుద్ధం చోటు చేసుకుంది. సర్దార్ పటేల్ ప్రథమ ప్రధాని అయి ఉంటే దేశ భవిష్యత్తు మరోలా ఉండేదని మోడీ పేర్కొనగా.. పటేల్ లౌకిక, ఉదార వాదాన్ని గుర్తు చేస్తూ, వాటిపై మోడీ హక్కును ప్రధాని ప్రశ్నించారు.
కార్యక్రమంలో మొదట మోడీ ప్రసంగిస్తూ.. ‘భారతీయులందరిదీ ఒకటే బాధ. పటేల్ ప్రథమ ప్రధాని కాలేనందుకు ప్రతీ భారతీయుడు ఇప్పటికీ బాధపడుతున్నాడు. ఆయన ప్రథమ ప్రధాని అయి ఉంటే భారతదేశ ముఖచిత్రం మరోలా ఉండేది’ అన్నారు. దేశాన్ని ఐక్యం చేసిన ఘనత పటేల్‌దేనని ప్రశంసించారు. పటేల్ సాధించిన ఐక్యత, సమగ్రత ఇప్పుడు తీవ్రవాదం, ఉగ్రవాదం వల్ల ప్రమాదంలో పడ్డాయని మోడీ ఆందోళన వ్యక్తంచేశారు. జవహర్‌లాల్ నెహ్రూ పేరెత్తకుండానే ఆయనపై మోడీ విమర్శలు గుప్పించడంతో ప్రధాని మన్మోహన్ స్పందించారు. ‘సర్దార్ పటేల్ కాంగ్రెస్‌వాది. ఆయన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు జీవితాంతం కృషిచేశారు. ఆయన నిజమైన లౌకికవాది. ఉదారవాది. సైద్ధాంతిక వైరుధ్యం ఉన్నవారిని కూడా ఆయన గౌరవించేవారు.
దేశ సమగ్రతపై ఆయనకు అపార నమ్మకం. దేశం మొత్తాన్ని ఒక గ్రామమని, అన్ని మతాల ప్రజలు బంధువులు, స్నేహితులని ఆయన నమ్మేవారు’ అంటూ మోడీకి చురకలేశారు. దాదాపు 500 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనత పటేల్‌దేనన్నారు. మహాత్మాగాంధీ, పటేల్, నెహ్రూ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్‌లకు దేశ సమగ్రతపై గట్టి నమ్మకముండేదన్నారు. ‘వారు అన్ని సిద్ధాంతాలను గౌరవించారు. పేదలను అభిమానించేవారు. ఆ లక్షణాలే ఇప్పుడు దేశంలో మృగ్యమయ్యాయి’ అని మన్మోహన్ వ్యాఖ్యానించారు. నెహ్రూ, పటేల్‌ల మధ్య విభేదాలున్నా, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించేవారన్నారు. అంతకుముందు మోడీ మాట్లాడుతూ.. మావోయిజం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రమాదం అని ప్రధాని మన్మోహన్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ‘సమర్థ పాలనకు ఇచ్చే పురస్కారాలనేకం మీ హయాంలో గుజరాత్ రాష్ట్రానికి దక్కాయి. అందుకు కృతజ్ఞతలు’ అని మన్మోహన్‌సింగ్‌ను ఉద్దేశించి మోడీ అన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా మన్మోహన్ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు.
హైజాక్ చేసేందుకే: కాంగ్రెస్
మరోవైపు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసత్వాన్ని హైజాక్ చేసేందుకు మోడీ, బీజేపీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. పటేల్ వారసత్వం కాంగ్రెస్‌కే చెందుతుందని స్పష్టం చేసింది. ‘మహాత్మాగాంధీని చంపింది ఆరెస్సెస్ చిందించిన మత విద్వేష విషమేన’ని పటేల్ వ్యాఖ్యానించిన విషయాన్ని పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ న్యూఢిల్లీలో గుర్తుచేశారు. ఆరెస్సెస్‌ను నిషేధించింది కూడా పటేలేనన్నారు. ‘ఇటుకలను సేకరించిన బీజేపీ అయోధ్యలో రామమందిరం నిర్మించలేదు. ఆ ఇటుకలను అమ్ముకుంది. ఇప్పుడు పటేల్ విగ్రహ ఏర్పాటు కోసం ఇనుమును సేకరిస్తోంది. తరువాత ఆ ఇనుమును కూడా అమ్ముకుంటారు’ అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. పటేల్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమానికి మోడీ పంపిన ఆహ్వానాన్ని కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ తిరస్కరించారు.
మోడీకి లభిస్తున్న ప్రాచుర్యాన్ని చూసి.. : వెంకయ్య
మోడీకి లభిస్తున్న ప్రజాభిమానాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు విమర్శించారు. సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. పటేల్ దేశం గర్వించదగిన మహనీయుడన్నారు. మహాత్మాగాంధీ హత్యలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రమేయం ఉన్నట్టు కాంగ్రెస్ దుష్ర్పచారాన్ని చేస్తోందన్నారు.