
శశికళ రాజకీయ చతురత!
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ మరోసారి తన రాజకీయ చతురత ప్రదర్శించారు.
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ మరోసారి తన రాజకీయ చతురత ప్రదర్శించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి తాను పెట్టుకున్న ముహుర్తానికి కేంద్రం పరోక్షంగా ఆటంకాలు కల్పించినా ఆమె నిబ్బరం కోల్పోలేదు. రాజకీయ వర్గాలు శశికళ ప్రమాణస్వీకార ముహుర్తం గురించి చర్చోపచర్చలు జరుపుతుంటే ఆమె మాత్రం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖాస్త్రం సంధించారు. రాజకీయాలకు సంబంధం లేని అంశం మీద లేఖ రాసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
శ్రీలంక అదుపులోకి తీసుకున్న 35 మంది తమిళ మత్స్యకారులు, 120 పడవలను వెంటనే విడిపించేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆమె లేఖ రాశారు. తమిళ రాజకీయమంతా తన చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో శశికళ విభిన్నంగా స్పందించడం ఆమె విలక్షణతను చాటిచెబుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జల్లికట్టు నిషేధం ఎత్తివేయాలని కోరుతూ ఇంతకుముందు ప్రధాని మోదీకి శశికళ లేఖ రాసిన సంగతి తెలిసిందే.
మరోవైపు సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవాలని ఆమె ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని జోక్యం కోరాలని భావిస్తున్నారు. శశికళ ముఖ్యమంత్రి కాకుండా చూడాలని కోరుతూ అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు.