
మోదీ మద్దతు కోరిన శశికళ
మెడికల్ కోర్సుల ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ విషయంలో అధికార అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మద్దతును కోరారు.
నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని విజ్ఞప్తి!
చెన్నై: మెడికల్ కోర్సుల ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ విషయంలో అధికార అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మద్దతును కోరారు. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) నుంచి తమిళనాడును మినహాయించాలని ఆమె కోరారు. ’నీట్ నుంచి తమిళనాడును మినహాయించే విషయంలో మేం మీ మద్దతును కోరుతున్నాం. మీరు మద్దతు తెలిపితే.. వైద్య అభ్యర్థులు మీకు ఎంతగానో కృతజ్ఞులై ఉంటారు’ అని ఆమె ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
నీట్ పరీక్ష వల్ల తమిళనాడు వైద్య విద్యార్థులు నష్టపోయే అవకాశముందని, అందుకే ఈ విషయంలో రాష్ట్ర అసెంబ్లీ రెండు బిల్లులు కూడా ఆమోదించిందని, ఈ నేపథ్యంలో కీలకమైన నీట్ విషయంలో ప్రధాని మోదీ తమకు అండగా నిలబడాల్సిన అవసరం పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన పేద, మధ్యతరగతి విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేందుకు నీట్ నుంచి తమిళనాడును తప్పించాలని తన మెంటర్ ’అమ్మ’ (జయలలిత) గతంలో గట్టిగా పట్టుబట్టారని ఆమె గుర్తుచేశారు. రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకే అసెంబ్లీ ఈ రెండు బిల్లులు ఆమోదించిందని లేఖలో తెలిపారు.