
ట్రంప్ విజయంపై సత్య నాదెళ్ల
శాన్‌ఫ్రాన్సిస్కో: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 45 వ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి బుధవారం అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వారందరితోనో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మెక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డ్ఇన్ పోస్ట్ లో చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించారని ప్రశంసించిన ఆయన ఈ ఎన్నికలు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత సాధించాయని పేర్కొన్నారు.
అధ్యక్షుడు సహా నిన్న ఎంపికయిన వారందరినీ అభినందించిన నాదెళ్ల వారందరితో పనిచేయడానికి తాము ఎదురుచూస్తున్నా మన్నారు. తమ ధృడమైన సిద్ధాంతాలు, విలువలకు కట్టుబడి ఉంటామని, ముఖ్యంగా విభిన్నమైన సంస్కృతులను చిత్తశుద్ధితో కలుపుకుపోతామని తెలిపారు. దీంతో తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో టెక్ కంపెనీలకు వ్యతిరేకంగా చేసిన సంచలన వ్యాఖ్యలను ఫాలో కావొద్దని సంకేతాలను అమెరికా నూతన అధ్యక్షుడికి సూచన ప్రాయంగా అందించారు భారతీయ సంతతికి చెందిన సత్య నాదెళ్ల. అలాగే కంపెనీ ఆలోచనలు, సిఫార్సులను అమెరికా కొత్త అడ్మినిస్ట్రేషన్, కాంగ్రెస్‌కు వివరిస్తూ మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ కూడా కంపెనీ బ్లాగులో ఒక పోస్ట్ పెట్టారు.