హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) గృహ, వాహన రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. ‘అప్నా ఘర్, అప్నా కార్’ పేరుతో పరిమిత కాలానికి ఈ తగ్గింపు రేట్లను అందిస్తున్నట్లు ఎస్‌బీహెచ్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రూ.75 లక్షల లోపు గృహరుణాలను బేస్ రేటు 10.20 శాతం వడ్డీకే ఇస్తుండగా, ఆ పై మొత్తం రుణాలకు 10.30% వసూలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రోజువారీ తగ్గింపు విధానంలో వడ్డీని లెక్కించడం జరుగుతుందని, లక్ష రూపాయల రుణాన్ని 30 ఏళ్లకు తీసుకుంటే నెలకు రూ. 892 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. గృహ రుణాల ప్రాసెసింగ్ ఫీజుపై 75 శాతం వరకు తగ్గింపును ఇస్తోంది. అలాగే కార్ లోన్స్‌పై వడ్డీరేట్లను 10.60 శాతం నుంచి 10.40 శాతానికి తగ్గించామని, గరిష్టంగా రూ.1,000 వరకు ప్రోసెసింగ్ ఫీజులో మినహాయింపు ఇస్తున్నట్లు ఎస్‌బీహెచ్ పేర్కొంది. ఈ రేట్లు మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి.