ఏసీలు అవసరంలేని దుస్తులు వస్తాయట!
కాలిఫోర్నియా: శీతల దేశాల్లో నివసించేవాళ్లు ఉష్ణ లేదా సమోష్ణ దేశాల్లో పర్యటించాలంటే అమ్మో, ఆవాడిని ఎలా తట్టుకుంటామంటూ భయపడి పోతారు. ఇక ఉష్ణ, సమోష్ణ దేశాల్లో నివసించే ప్రజలకు కూడా ఎండాకాలం వచ్చిదంటే వేడికి తల్లడిల్లిపోతారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోకలిగితే వేడిని తట్టుకోవడం చాలా ఈజీ అని శాస్త్రవిజ్ఞానం ఎప్పుడో తేల్చి చెప్పింది. ఏసీ గదుల్లో కాకుండా బయటి వాతావరణంలో కూడా మన శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ఎలా? అందుకు ఎలాంటి ఉపకరణాలు ఉపయోగపడతాయి?
సరిగ్గా ఇదే ఆలోచనతో కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ ఆధారిత వస్త్రాన్ని తయారు చేశారు. దీన్ని దుస్తులుగా ధరిస్తే శరీరం ఉష్ణోగ్రత రెండు సిల్సియస్ డిగ్రీలు తగ్గుతుందట. అంటే ఫ్యాన్లు, ఏసీలు ఆన్ చేసుకోకుండా ఇంట్లో ఉండే సౌలభ్యం ఈ దుస్తుల వల్ల కలగుతుందని శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన స్టాన్‌ఫర్డ్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఈ కీ ‘సైన్స్’ పత్రికలో తెలియజేశారు.
ఇన్‌ఫ్రారెడ్ (పరారుణ) కిరణాల వల్ల మానవ శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుందని, ఆ కిరణాలు సోకకుండా తాము తయారు చేసిన వస్త్రం అడ్డుకుంటుందని ఫొటోనిక్స్‌లో నైపుణ్యం కలిగిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ షాన్‌హు ఫ్యాన్ తెలిపారు. ఇంతవరకు ఈ కిరణాలు అడ్డుకునే దుస్తులు తయారుచేసే దిశగా పెద్దగా పరిశోధనలేవీ సాగలేదని ఆయన చెప్పారు. ఏ రకమైన దుస్తులు ధరించినా శరీరంలో ఎంతో కొంత వేడి పుడుతుందని, చల్లగా ఉంచే దుస్తులు తయారు చేస్తే పలు ప్రయోజనాలు ఉంటాయని ఉద్దేశంతో తాము ప్లాస్టిక్‌తో కూడిన కొత్త వస్త్రం ముక్కలను తయారు చేసి విజయం సాధించామని ఆయన వివరించారు.
ప్లాస్టిక్ పాలును తగ్గించి సాధారణ వస్త్రాలకు దగ్గరిగా ఉండేలా ఈ వస్త్రాన్ని అభివృద్ధి చేస్తామని, వివిధ రంగుల్లో ప్రజలు దుస్తులుగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ దుస్తులు మార్కెట్‌లోకి వచ్చినట్లయితే ఫ్యాన్లు, ఏసీల అవసరంపోయి విద్యుత్ ఆదా అవుతుందని వారు భావిస్తున్నారు.