
జోరు వానలోనూ ఆగని పోరు
సాక్షి నెట్‌వర్క్: ఎడతెరపి లేని వర్షంలోనూ సమైక్య సెగ ఎగసింది. సీమాంధ్ర జిల్లాల్లో సోమవారం జోరు వానను సైతం లెక్కచేయకుండా సమైక్యవాదులు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమగోదావరి, వైఎస్సార్ జిల్లాల్లో వేకువజాము నుంచి రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉన్నా నిరసనలు పోటెత్తాయి. రాష్ట్రాన్ని విభజిస్తే చూస్తూ ఊరుకోమని సమైక్యవాదులు హెచ్చరించారు. ఏఐసీసీ అధిష్టానం వేర్పాటు ప్రకటన వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.
దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు, మానవహారాలు, అర్ధనగ్న ప్రదర్శనలు, వంటావార్పులు, రాస్తారోకోలతో హోరెత్తించారు. సోనియాగాంధీ, కేసీఆర్, బొత్సల దిష్టిబొమ్మల దహనాలు, శవయాత్రలు సోమవారం కూడా అడుగడుగునా కనిపించాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కటిక యువజన సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మిగనూరులో మాల మహానాడు యూత్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మకు మద్యం బాటిళ్ల దండను వేసి పుర వీధుల్లో ఊరేగించారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కేసీఆర్, సోనియగాంధీ దిష్టిబొమ్మలను ఊరేగించి ఆర్‌టీసీ కాంప్లెక్స్ వద్ద దహనం చేశారు. విజయనగరంలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స, దిగ్విజయ్ సింగ్, రాహుల్‌గాంధీ, సోనియా గాంధీ, కేసీఆర్ మాస్కులు వేసుకున్న వ్యక్తులు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి సీమాంధ్ర ప్రజల చెవిలో పువ్వులు పెట్టినట్లు నిరసన వ్యక్తం చేశారు. విశాఖలో భవన నిర్మాణ కార్మికులు కేసీఆర్, సోనియాలకు సమాధి కడతాం అంటూ లారీల్లో బొమ్మల్ని ఊరేగించి వినూత్నంగా నిరసన తెలిపారు. చిల్లర వర్తకులు గుర్రాలు, ఒంటెలపై ప్రదర్శనగా వెళ్లి బీచ్‌రోడ్డులోని పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
రైతుబజార్ల బంద్
కృష్ణాజిల్లా వ్యాప్తంగా రైతుబజార్లు మూతపడ్డాయి. ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉన్నా జిల్లాలో ఆందోళనలు మిన్నంటాయి. కేబుల్ ఆపరేటర్లు పూర్తిగా వినోద ప్రసారాలను నిలిపివేశారు. సోమవారం అర్ధరాత్రి నుంచి 24 గంటల బంద్ చేపట్టాలని పెట్రోల్‌బంక్‌ల యాజమాన్యాలు నిర్ణయించాయి. నూజివీడులో వీఆర్‌వోలు భారీ ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నేత గౌతంరెడ్డి నేతృత్వంలో విజయవాడలో అర్చకులు సమైక్యాంధ్ర కోసం హోమం నిర్వహించారు. తిరువూరులో వేలాదిమంది విద్యార్థులు, డ్వాక్రా మహిళలు ప్రదర్శన చేపట్టారు.
ఎడ్లబండ్ల ర్యాలీ
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెనుగంచిప్రోలులో భారీ ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను పాల్గొని రైతుల ఉద్యమానికి ఊతమిచ్చారు. సమైక్యాంధ్ర పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ఏలూరు నగర బంద్ ప్రశాంతంగా జరిగింది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి ఉద్యమానికి మద్దతు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో వంటావార్పు నిర్వహించారు. భీమవరం పరిసర ప్రాంతాలకు చెందిన క్రైస్తవ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించి, ప్రార్థనలు చేపట్టాయి. పాలకొల్లులో రైతు వేదిక ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు సమైక్యాంధ్ర కోరుతూ కదం తొక్కారు.
మరో రెండురోజులు ‘తూర్పు’బంద్
తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా సోమవారం బంద్ పాటించారు. మంగళ, బుధవారాలు కూడా బంద్ పాటించాలని జేఏసీలు నిర్ణయించాయి. విద్యా సంస్థలు వరుసగా 12వ రోజు కూడా మూత పడ్డాయి. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. మంత్రి తోట నరసింహం సతీమణి వాణి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరింది.
చేనేత కార్మికుల ప్రదర్శన
పిఠాపురంలో చేనేత కార్మికుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. తుని, పాయకరావు పేటల్లో రిక్షాపుల్లర్స్ ర్యాలీలు నిర్వహించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన 23 ఐసీడీఎస్ ప్రాజెక్టుల ఉద్యోగులు రాజమండ్రిలో ర్యాలీ చేపట్టారు.
వికలాంగుల నిరశన దీక్షలు
రాజానగరం సెంటర్‌లో వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. అనపర్తిలో నాయీ బ్రాహ్మణులు సోనియా గాంధీ, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలతో శవయాత్ర చేసి దేవీచౌక్‌లో దగ్ధం చేశారు. నెల్లూరు జిల్లాలో వర్షాన్ని సైతం లెక్కచేయక జనం రోడ్లమీదకు వచ్చారు. నెల్లూరు నగరంలోని జాతీయ రహదారిపై జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించి హైవేను దిగ్బంధించడంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచి పోయింది. కావలిలో ఎన్‌టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి సమైక్య ఉద్యమానికి మద్దతు పలికారు. ప్రకాశం జిల్లాలో సోమవారం వేకువజాము నుంచి జోరున వర్షం పడుతున్నా సమైక్య హోరు మాత్రం కొనసాగింది. పర్చూరులో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త గొట్టిపాటి నరసయ్య కుమారుడు భరత్ చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. కనిగిరిలో వైఎస్సార్ సీపీ నాయకుడు రాజాల ఆదిరెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష రెండో రోజుకు చేరింది.
కదం తొక్కిన కార్మికులు
కర్నూలు నగరంలో వైఎస్సార్సీపీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వేలాదిమంది ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కనిపించడం లేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆదోనిలో విద్యుత్‌శాఖ ఉద్యోగులు విధులు బహిష్కరించి సమైక్య ఆందోళనలో పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి సందర్శించి సంఘీభావం ప్రకటించారు. నంద్యాలలో రాయలసీమ ఇంజినీరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టగా.. వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి సంఘీభావం ప్రకటించారు.
గళార్చనతో నిరసన
తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి రాస్తారోకో చేపట్టారు. ఇందిరా మైదానంలో ఏపీ ఎన్‌జీవోల ఆధ్వర్యంలో గళార్చన నిర్వహించి ఉద్యోగులు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తిరుపతి జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి ఆధ్వర్యంలో సుమారు 300 మంది మహిళలు ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్‌లో కార్మికులు బస్సులను తాడుతో కట్టి లాగి నిరసన తెలిపారు.
చిత్తూరులో వైఎస్సార్‌సీపీ నేత ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో జానపద గేయాలతో ప్రజలను చైతన్య పరచారు. పుంగనూరులో వైఎస్సార్ కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో సుమారు 4వేల మంది దళిత, గిరిజనులతో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గుంటూరు కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్ నేతృత్వంలో జోరువర్షాన్ని సైతం లెక్కచేయకుండా గుంటూరులో ఆందోళనలు చేపట్టారు. దుగ్గిరాలలో పసుపు రైతుల నిరసన నేపథ్యంలో యార్డులో వేలం ప్రక్రియను నిలిపివేశారు.
10వేల మందితో సమైక్య మార్చ్
పీసీసీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం విజయనగరం జిల్లా చీపురుపల్లి కేంద్రంలో సమైక్య నినాదం హోరెత్తింది. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలు పదివేలమందికిపైగా చేయి చేయి కలిపి భారీ మార్చ్ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విద్యార్ధులు నిరసనప్రదర్శనలు చేపట్టారు. పాలకొండ-విశాఖపట్నం రహదారిలో గోపాలపురం వద్ద , యువజన సంఘాల ప్రతినిధులు నాటుబండ్లు, ట్రాక్టర్ ట్రాలీలు రోడ్డుకు అడ్డంగా పెట్టి రాస్తారోకో నిర్వహించారు. ఎచ్చెర్లలోని బీఆర్‌ఏయూ విద్యార్థులు ఆంటోని కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు.
‘అనంత’ 48 గంటల జిల్లా బంద్ విజయవంతం
అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 48 గంటల జిల్లా బంద్ విజయవంతమైంది. వైఎస్సార్‌సీపీతో పాటు టీడీపీ కూడా బంద్‌కు పిలుపునివ్వడంతో సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉద్యమం తీవ్రంగా కొనసాగింది. విశాఖ నగరంలోని శ్రీకనకమహాలక్ష్మి దేవస్థానం అధికారులు, ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి జగదాంబ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడ్డారు.
14న విశాఖలో సింహగర్జన
14న ఏయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ ఇంజినీరింగ్ గ్రౌండ్స్‌లో సింహగర్జన ఉంటుందని, బీచ్‌రోడ్డులో ఈనెల 18న మిలీనియం మార్చ్ నిర్వహిస్తామని సమైక్యాంధ్ర జేఏసీ నేతలు ప్రకటించారు.
బద్వేలులో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు
వైఎస్సార్ జిల్లా బద్వేలులో క్రైస్తవ సోదరులు శాంతి ర్యాలీ నిర్వహించి నాలుగురోడ్ల కూడలిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని వేడుకున్నారు. కడపలో గెజిటెడ్ అధికారులు సైతం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలియజేశారు. ఇరిగేషన్ ఉద్యోగులు వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టి తమ నిరసనను తెలియజేశారు. ఆర్టీపీపీలో ఉద్యోగులు విధులను బహిష్కరించారు.
గడికోట, రవీంద్రనాథ్‌ల ఆమరణ నిరశన
సాక్షి, కడప: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండ్‌తో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కడప మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి సోమవారం నుంచి వైఎస్సార్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. వీరివురికి సంఘీభావం తెలిపేందుకు తరలివచ్చిన జనంతో కలెక్టరేట్ పరిసరప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ జీవితాలను త్యాగం చేసైనా విభజనను అడ్డుకుంటామన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ర్టవ్యాప్తంగా ప్రాంతాలకతీతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని తట్టుకోలేకే విభజన అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
దమ్ముంటే కాంగ్రెస్ అధిష్టానం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలే గానీ ఇలా కుట్రలు చేసి రాష్ట్రాన్ని ముక్కలు చేస్తూంటే జనం చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రాయలసీమ వాసి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఈ ప్రాంతం తరఫున ఏ వాదన వినిపించకపోవడం దారుణమన్నారు. తెలంగాణలో కూడా 50 శాతం మంది రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని వారు పేర్కొన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ, రాజ్యాధికారం కోసం కాంగ్రెస్‌పార్టీ తెలుగుజాతిని రెండు ముక్కలుగా చేసేందుకు సిద్ధపడిందని మండిపడ్డారు. విభజన జరిగిన తర్వాత జూరాల ఎత్తుపెంచితే రాయలసీమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే సాగునీటి సమస్యలతో సీమ రైతాంగం అల్లాడిపోతోందని, విభజన జరిగితే ఎడారి కావడం త థ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమరణ నిరాహారదీక్షలో వైసీపీ నేతలు హఫీజుల్లా, పాండురంగారెడ్డి, సంపత్‌లు కూడా కూర్చున్నారు. మరో 12మంది రిలేనిరాహారదీక్షలో కూర్చున్నారు.
పగిలిన గుండెలు
సాక్షి నెట్‌వర్క్: సీమాంధ్రలో మృత్యుఘోష ఆగడం లేదు. విభజన వార్తలను తట్టుకోలేక సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో గుండెపోటుతో తొమ్మిది మంది మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చిన్నసాన గ్రామానికి చెందిన బోనెల వైకుంఠరావు (23) పొక్లెయిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న అతను రాష్ట్రాన్ని విడదీయవద్దని బిగ్గరగా కేకలు వేస్తూ నేలకొరిగిపోయాడు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయిందని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. విజయనగరం జిల్లా జామి మండలం భీమసింగి పంచాయతీ పరిధిలోని కంది శ్రీరామపురంలో జామి వెంకటరావు విభజన వార్తలపై పదిరోజులుగా ఆవేదన చెందుతున్నాడు.
ఈ క్రమంలో న్యూస్‌పేపర్ చదువుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలొదిలాడు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంక గెడ్డంవారిపేటకు చెందిన కూలీ బూల పల్లయ్య (40) పెద్దకొడుకు వెంకటేష్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రాష్ట్రాన్ని విడదీస్తున్నారని మనస్తాపం చెందిన పల్లయ్య హైదరాబాద్ నుంచి సీమాంధ్రులు వెళ్లిపోవలసిందేనని కేసీఆర్ అన్నరోజు నుంచీ మరింత ఆందోళనకు గురయ్యాడని, సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించాడు. అనంతపురం జిల్లా సోమందేపల్లికి చెందిన బాదయ్యపల్లి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి చెందాడు.
పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం వరిఘేడు గ్రామానికి చెందిన దాసి మత్తయ్య (58) సోమవారం రాత్రి టీవీలో విభజన వార్తలు చూస్తూ కలతచెంది గుండెపోటుతో మరణించగా, దెందులూరుమండలం దోసపాడులో పెనుబోయిన సుబ్బమ్మ (70) విభజన నిర్ణయూన్ని తట్టుకోలేక.. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న తన మనుమడి భవిష్యత్‌పై బెంగపెట్టుకుని సోమవారం గుండె ఆగి మరణించింది.సమైక్యాంధ్ర ఉద్యమాలకు సంబంధించి టీవీల్లో వార్తలు చూస్తూ ఉద్వేగానికి లోనై సోమవారం వైఎస్‌ఆర్ జిల్లాలో ముగ్గురు గుండె పోటుతో మృతి చెందారు. జమ్మలమడుగు మండలం సిరిగేపల్లిలో బుకే రామదాసు నాయక్ (40) ఆదివారం రాత్రి టీవీ వార్తలు చూస్తూ గుండె నొప్పితో కుప్పకూలి మరణించారు. అట్లూరు క్రాస్‌రోడ్డులోని మద్దూరు కాలనీకి చెందిన నరసింహులు (35) ఎక్కడైనా సమైక్యాంధ్రకు మద్దతుగా ధర్నాలు జరుగుతుంటే వెళ్లేవాడు. సోమవారం రాత్రి టీవీ చూస్తూ గుండె పోటు రావడంతో ఆటోలో కడపకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. రైల్వేకోడూరులోని పారిశుద్ధ్య కాలనీలో సమైక్య ఉద్యమం వార్తలు చూస్తూ సోమవారం ఎన్.మంజుల (35) గుండెపోటుతో మృతిచెందినట్లు సమీప బంధువులు తెలిపారు.