ఆర్‌టి.. యూటీలొద్దు.. జనోద్యమం @ 119
సాక్షి నెట్‌వర్క్: రాయల్ తెలంగాణ (ఆర్‌టి)... హైదరాబాద్ యూటీ... ఇటువంటి ప్రతిపాదనలేమీ వద్దని సమైక్యాంధ్రప్రదేశ్‌ను యథాతథంగానే ఉంచాలని సీమాంధ్ర ప్రజ నినదిస్తోంది. అడ్డగోలు ప్రతిపాదనలతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని తెగేసి చెబుతోంది. సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 119వ రోజైన మంగళవారం కూడా సీమాంధ్ర జిల్లాల్లో ఉద్ధృతంగానే సాగింది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, యూపీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలతో ఉద్యమాన్ని హోరెత్తించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో విద్యార్థులు 119 సంఖ్య ఆకారంలో కూర్చొని సమైక్య నినాదాలు చేశారు. తిరుపతిలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. నగరంలో యువకులు భారీ మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్ర విభజనపై కేంద్రమంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల విధానాలు, తీరుతెన్నులపై కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో విద్యార్థులు మాక్ పార్లమెంట్ నిర్వహించారు. మున్సిపల్ కూడలి వద్ద నడిరోడ్డుపై నిర్వహించిన ఈ ప్రదర్శనలో విద్యార్థులు మంత్రులు, స్పీకర్, రాష్ట్ర ఎంపీల ముఖచిత్రాల మాస్క్‌లు ధరించి రాష్ర్ట విభజన వద్దంటూ తీర్మానించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యార్థులు రాస్తారోకో చేసి మానవహారం నిర్మించారు. సీమాంధ్ర ప్రజల సమైక్య డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ సమైక్యాంధ్ర పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ నగరంలో సీడబ్ల్యూసీ, జీఓఎమ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
వైఎస్సార్సీపీ శ్రేణుల ఉద్యమపథం
సమైక్యాంధ్ర పరిరక్షణకు అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం పలు నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టి ఇంటింటికీ వెళ్లి సమైక్యాంధ్ర ఆవశ్యకతను, రాష్ట్ర పరిరక్షణకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అవిరళ కృషిని వివరిస్తున్నారు.