బ్యాంక్, మెటల్ స్టాక్స్ బతికించాయి!
Published Mon, Jan 16 2017 4:02 PM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM
ముంబై : స్వల్పనష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు బ్యాంకింగ్, మెటల్ స్టాక్స్ లాభాలతో పునరుద్ధరించుకున్నాయి. సెన్సెక్స్ 50.11 పాయింట్ల లాభంతో 27,288 వద్ద, నిఫ్టీ 12.45 పాయింట్ల లాభంలో 8,412వద్ద ముగిశాయి. మూడు బ్యాంకుల ఫలితాలు మెరుగ్గా వెల్లడికావడంతో ఫైనాన్సియల్ షేర్లలో సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్సియల్ షేర్లు లాభాల బాట పట్టాయి. 2016 నవంబర్ 21 నుంచి మొదటిసారి నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 1 శాతం పైగా ట్రేడ్ అయి, ఆఖరికి 0.97వద్ద ముగిసింది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా 2.19 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 0.84 శాతం పైకి దూసుకెళ్లాయి. ఇదే క్రమంలో ఐటీ స్టాక్స్లో సెంటిమెంట్ బలహీనపడింది.
సాఫ్ట్వేర్ సర్వీసుల అతిపెద్ద ఎగుమతిదారి ఇన్ఫోసిస్ లిమిటెడ్ మళ్లీ రెవెన్యూ అవుట్లుక్(గైడెన్స్) తగ్గించడంతో సెంటిమెంట్ వీక్గా ఉందని, ట్రంప్ పాలసీల్లో తదుపరి క్లారిటీ కోసం పెట్టుబడిదారులు వేచిచూస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న డొనాల్డ్ ట్రంప్ తన ఎకనామిక్ ప్లాన్స్పై ఏమైనా క్లారిటీ ఇస్తారేమోనని పెట్టుబడిదారులందరూ ఎంతో ఆతృతగా వేచిచూస్తున్నట్టు తెలుస్తోంది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ 2.57 శాతం, ఇన్ఫోసిస్ 1.88 శాతం పడిపోవడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.88 శాతం నష్టాల్లోకి పడిపోయింది. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 0.02 పైసల లాభంతో 68.13వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లోనూ 10 గ్రాముల బంగారం ధర 164 రూపాయల లాభంతో 28,554గా నమోదైంది.
Advertisement
Advertisement