
మార్కెట్లు నింగికి సంపద నేలకు!
ముంబై: ఏడాది కాలంలో అంటే జనవరి 1 నుంచి సెన్సెక్స్ 4% పుంజుకోగా, ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు మాత్రం దాదాపు రూ. 3.5 లక్షల కోట్లమేర చిల్లుపడటం విశేషం! 2012 డిసెంబర్ 31న 19,426 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ ఈ నెల 22కల్లా 20,217కు ఎగసింది. ఇది 791 పాయింట్ల లాభం! ఇదే కాలంలో ఇన్వెస్టర్ల సంపద మాత్రం రూ. 3.46 లక్షల కోట్లు ఆవిరై రూ. 66.39 లక్షల కోట్లకు పరిమితమైంది. కాగా, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ 11 నెలల కాలంలో రూ. 96,461 కోట్లు (17.4 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేయడం గమనార్హం.
అయితే ఇందుకు విరుద్ధమైన రీతిలో 2012 ఏడాదిలో సెన్సెక్స్ 25% పుంజుకుంటే ఇన్వెస్టర్ల సంపద (లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ) 27% ఎగసి రూ. 67.7 లక్షల కోట్లకు చేరింది. ఇదే కాలంలో ఎఫ్‌ఐఐలు రూ. 1,27,455 కోట్లు(24 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. కాగా, ఓవైపు డాలరుతో మారకంలో రూపాయి విలువ క్షీణించడం, మరోపక్క అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్యాకేజీల ఉపసంహరణ సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ ఈ ఏడాది ఎఫ్‌ఐఐలు దేశీ స్టాక్స్‌ను కొనుగోలు చేస్తూ రావడం చెప్పుకోదగ్గ అంశం. ఫలితంగా మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ ఈ ఏడాది ఆగస్ట్ 28న 52 వారాల కనిష్ట స్థాయికి పడినప్పటికీ, తిరిగి ఈ నెల 3కల్లా 21,321 పాయింట్లకు దూసుకెళ్లింది. ఇది దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే కొత్త గరిష్టం! దీంతో పోలిస్తే ప్రస్తుతం సెన్సెక్స్ 5%పైగా(1,104 పాయింట్లు) క్షీణించింది.