పని చేస్తేనే జీతం పెంపు!
ఏడో వేతన సంఘం సిఫార్సు
న్యూఢిల్లీ: విధుల్లో నిర్లక్ష్యం వహించి, పని తప్పించుకు తిరిగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది చేదు వార్త. ఇకపై వృత్తిలో మెరుగైన ప్రదర్శన కనబరిస్తేనే జీతంలో వార్షిక పెరుగుదల ఉంటుంది. సేవలు సంతృప్తికరంగా లేకపోతే ఎప్పటిలా వేతనం పెరిగే అవకాశాలు ఉండకపోవచ్చు. ఏడో కేంద్ర వేతన సంఘం ఈ మేరకు ప్రభుత్వానికి సిఫార్సులు పంపింది. అలాగే అన్ని కేటగిరీలు, స్థాయిల్లో ప్రదర్శన ఆధారిత వేతనం (పీఆర్‌పీ) పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించింది. పదోన్నతుల్లానే వేతనం కూడా క్రమానుగుణంగా పెరగాలని పేర్కొంది. మోడిఫైడ్ అష్యూర్డ్ కెరీర్ ప్రోగ్రెషన్ (ఎంఏసీపీ) మాదిరి వృత్తిలో నిర్దేశిత స్థాయిని చేరుకున్న ఉద్యోగులకే వార్షిక వేతన పెరుగుదల ఇవ్వాలని అభిప్రాయపడింది.
లేని పక్షంలో తొలి 20 ఏళ్ల సర్వీసులో సాధారణ పదోన్నతుల నుంచి కూడా వారిని మినహాయించాలని సూచించింది. కేవలం ఇది ప్రదర్శనకు సంబంధించిన అంశమే కనుక క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తీసుకొనే నిర్ణయాలకు ఇది వర్తించదని తన నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాకుండా సదరు ఉద్యోగులు కావాలంటే స్వచ్ఛంద పదవీ విరమణ నియమనిబంధనల ప్రకారం ఉద్యోగం వదిలేయవచ్చని పేర్కొంది. సర్వీస్‌లో 10, 20, 30వ ఏట ఎంఏసీపీ పొందుతారని వెల్లడించింది. ఈ నిబంధనలు ఉద్యోగుల్లో మార్పు కోసమేనని కమిషన్ అభిప్రాయపడింది. వీటన్నింటితోపాటు ఎంఏసీపీ ఇచ్చే ముందు డిపార్ట్‌మెంటల్ పరీక్షల వంటి వాటిల్లో కచ్చితమైన పద్ధతిని తీసుకురావాలని సూచించింది. అన్ని విభాగాలు, శాఖల్లో ఈ పద్ధతిని అమలు చేయాలంటే కొంత సమయం పడుతుందని, ఈ లోగా ఆకర్షిత బోనస్‌ను ప్రవేశపెట్టే ప్రయత్నం చేయాలని కోరింది.