37 మంది ఏకగ్రీవం.. రాజ్యసభకు పవార్, దిగ్విజయ్, వోరా
రాజ్యసభకు పవార్, దిగ్విజయ్, వోరా
న్యూఢిల్లీ: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల నుంచి 37 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం ముగియడంతో ఏకగ్రీవంగా ఎన్నికైన వారి పేర్లను ప్రకటించారు. వీరిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్, కేంద్ర మంత్రి శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, దిగ్విజయ్ సింగ్, మురళీ దేవ్‌రా, కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) నేత రాందాస్ అథవాలే తదితరులు ఉన్నారు. అథవాలేకు బీజేపీ మద్దతిచ్చింది.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్న పవార్ మహారాష్ట్ర నుంచి, ఢిల్లీ బీజేపీ శాఖ అధ్యక్షుడు విజయ్ గోయెల్ రాజస్థాన్ నుంచి ఎన్నికయ్యారు. పదేళ్లుగా పోటీ రాజకీయాలకు దూరంగా ఉన్న దిగ్విజయ్ మధ్యప్రదేశ్ నుంచి ఎన్నికయ్యారు. రాజ్యసభలో భర్తీ చేయాల్సిన మిగిలిన 18 స్థానాలకు ఈ నెల 7న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 6, పశ్చిమ బెంగాల్‌లో 5, ఒడిశాలో 4, అస్సాంలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి పోటీ పడుతున్న ప్రముఖుల్లో సంజయ్ సిన్హ్(కాంగ్రెస్), మిథున్ చక్రవర్తి(తృణమూల్ కాంగ్రెస్), తదితరులు ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన వారి వివరాలు..
మహారాష్ట్ర: మురళీ దేవరా, హుసేన్ దల్వాయ్(కాంగ్రెస్), శరద్ పవార్, మజీద్ మీనన్(ఎన్సీపీ), రాజ్‌కుమార్ దూత్(శివసేన), సంజయ్ కాకడే(స్వతంత్ర అభ్యర్థి), రాందాస్ అథవాలే(ఆర్పీఐ)
రాజస్థాన్: విజయ్ గోయెల్, రామ్ నారాయణ్ దూడీ, నారాయణ్ పచారియా(బీజేపీ)
బీహార్: రామ్‌నాథ్ ఠాకూర్, హరివంశ్, కకాశా ప్రవీణ్(జేడీయూ. వీరు రాజ్యసభకు ఎన్నికవడం ఇదే తొలిసారి), సీపీ ఠాకూర్, ఆర్‌కే సిన్హా(బీజేపీ)
తమిళనాడు: ఎల్ శశికళ పుష్ప, విజిలా సత్యనాథ్, ముత్తుకురుప్పన్, ఏకే సెల్వరాజ్(అన్నాడీఎంకే), తిరుచ్చి శివ(డీఎంకే), టీకే రంగరాజన్(సీపీఎం)
మధ్యప్రదేశ్: దిగ్విజయ్ సింగ్(కాంగ్రెస్), ప్రభాత్ ఝా, సత్యనారాయణ్ జతియా(బీజేపీ)
ఛత్తీస్‌గఢ్: మోతీలాల్ వోరా(కాంగ్రెస్), రణవిజయ్ ప్రతాప్ సింగ్ జుదేవ్(బీజేపీ)
హర్యానా: కుమారి సెల్జా(కాంగ్రెస్), రామ్‌కుమార్ కశ్యప్(ఇండియన్ నేషనల్ లోక్‌దళ్)
గుజరాత్: మధుసూదన్ మిస్త్రీ(కాంగ్రెస్), శంభుప్రసాద్ తుండియా, చునీభాయ్ గోహిల్, లాల్‌సిన్హ్ వడోదియా(బీజేపీ.. ముగ్గురూ రాజ్యసభకు ఎన్నికవడం ఇదే తొలిసారి).
జార్ఖండ్: ప్రేమ్‌చంద్ గుప్తా(ఆర్జేడీ), పరిమళ్ నథ్వానీ(స్వతంత్ర అభ్యర్థి)
మణిపూర్: అబ్దుల్ సలామ్(కాంగ్రెస్), మేఘాలయ: వాన్సుక్ సయీమ్(కాంగ్రెస్), హిమాచల్‌ప్రదేశ్: విప్లవ్ ఠాకూర్(కాంగ్రెస్)