మర్మమేంటి: సీఎంపై మౌనం.. మోదీపై ఫైర్!
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ మిత్రపక్షాలను మార్చుకొని.. మళ్లీ అధికార పీఠంపై కొలువైన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత శరద్ యాదవ్.. నితీశ్‌పై వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. అదే సమయంలో కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై ఆయన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. లాలూకు ఝలక్ ఇచ్చి నితీశ్ మళ్లీ బీజేపీ పంచన చేరిన నేపథ్యంలో శరద్ యాదవ్ పార్టీ వైఖరికి భిన్నంగా మోదీపై ఫైర్ అవుతుండటం గమనార్హం. గతంలో వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కారులో కేంద్రమంత్రిగా పనిచేసిన ఆయన తాజాగా మోదీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ వరుస ట్వీట్లు పెట్టారు.
'అధికార పార్టీ ప్రధాన నినాదమైన నల్లధనాన్ని విదేశాల నుంచి రప్పించలేదు. పనామా పత్రాల్లో పేరున్న వారిని పట్టుకోలేదు. ప్రభుత్వ రంగ ఆస్తులను కాపాడటానికి బదులు అందులోని పెట్టుబడులను నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం ఉపసంహరించుకుంటోంది. మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఫజల్ బీమా యోజన ఒక పెద్ద వైఫల్యం. దీని గురించి రైతులకు తెలియదు. ఇన్సూరెన్స్ కంపెనీలు రైతుల రుణాల నుంచి బీమా ప్రీమియాన్ని కోసివేసి లబ్ధి పొందుతున్నాయి' అని శరద్ యాదవ్ వరుస ట్వీట్లలో మండిపడ్డారు.
నితీశ్‌కుమార్ మళ్లీ బీజేపీ చెంత చేరడంపై శరద్‌యాదవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన మోదీపై విమర్శలు గుప్పిస్తూ.. నితీశ్‌పట్ల మౌనంగా ఉండటం వెనుక మర్మమేమిటన్నదని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆయన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గూటికి చెరవచ్చునని తెలుస్తోంది.