లండన్: 'పొగ తాగని వాడు దున్నపోతై పుట్టు ' అన్నాడు గిరీశం. వినుడు వినుడు ఈ సిగిరెట్ గాధ వినుడు అని మరోకవి అన్నాడు. అయితే ఇవన్నీ వినేందుకు, పాట రూపంలో పాడుకునేందుకు బాగున్నా వాస్తవానికి పొగ తాగడం చాలా ప్రమాదకరం. పొగత్రాగే పురుషుల సంగతి ప్రక్కనే పెడితే.. గర్భిణీలు పొగత్రాగితే వారి పిల్లలతో పాటు మనవరాండ్రకూ హాని జరుగుతుందట. గర్భిణీల పిల్లలకు పొగత్రాగే అలవాటు లేకపోయినా.. వారి పిల్లలకు హాని చేకూరుస్తుందని తాజా సర్వేలో వెల్లడైంది. మహిళలు గర్భిణీలుగా ఉన్న సమయంలో పొగత్రాగితే కచ్చితంగా వారి మనవరాండ్ర జీవితంపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వారు ఎముకలు, కండరాలు సంబంధిత వ్యాధుల బారిన పడి కుచించుకుపోయే అవకాశం ఉందని తెలిపారు.
మగ పిల్లలు యవ్వన దశలో చేరేసరికి దీని ప్రభావం కచ్చితంగా కనబడుతుందని తెలిపారు. వారి కండరాలు పెరగాల్సిన దానికంటే మరింత ఎక్కువ పెరిగి దుష్రభావానికి దారితీస్తుందని స్పష్టం చేశారు. అదే బాలికలైతే పెరగాల్సిన ఎత్తుతో పాటు, బరువులో తీవ్రమైన వ్యత్యాసం వస్తుందని తెలిపారు.