హార్ట్ పేషెంట్లకు కొత్త ఔషధం!
బీజింగ్: హృద్రోగ బాధితుల చికిత్సలో పాము విషం కూడా ఉపయోగపడుతుందని తాజా అధ్యయనం తేల్చింది. పాము విషంలోని ఓ ప్రొటీన్ రక్తం గడ్డకట్టే పరిస్థితిని నిరోధిస్తుందని పేర్కొంది. ఇందుకోసం వైద్యులు ఉపయోగించే ఆస్పిరిన్ కన్నా ఇదే సురక్షితమైన ప్రత్యామ్నాయమని తెలిపింది.
హృద్రోగ బాధితులలో రక్తం గడ్డకట్టకుండా చేసేందుకు నిపుణులు ఆస్పిరిన్ వంటి మాత్రలపైన ఆధారపడతారు. ఆస్పిరిన్ వల్ల రక్తం గడ్డకట్టకపోవడంతో.. ప్రమాదాల్లో తగిలిన దెబ్బలలో విపరీతమైన రక్తస్రావం జరిగి బాధితుల ప్రాణం మీదికి వస్తోంది. ఈ పరిస్థితిని ట్రోపిడోలేమస్ వాగ్లెరిక్స్ అనే పాము విషంతో అధిగమించవచ్చని తైవాన్ శాస్త్రవేత్తలు వివరించారు. ఇందులో ఉండే త్రోవగ్లెరిక్స్ ప్రోటీన్ రక్త నాళాల్లో ఆటంకాలు ఏర్పడకుండా నిరోధించడంతో పాటు ప్రమాదాలు జరిగినప్పుడు అధిక రక్తస్రావం జరగకుండా చేస్తుందని తమ పరిశోధనలో తేలినట్టు నేషనల్ తైవాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఈ ప్రోటీన్ సమర్థవంతంగా పనిచేసిందన్నారు. దీన్ని మనుషులపై ఇంకా ప్రయోగించలేదని తెలిపారు. ఈ ప్రయోగానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆర్టెరియోస్కోరోసిస్, త్రోంబయాసిస్ అండ్ వాస్కులార్ బయాలజీ జర్నల్‌లో ప్రచురించారు.