అరెస్టు ఆపేయాలంటూ సుప్రీం కోర్టుకు..
న్యూఢిల్లీ: అక్కడా ఇక్కడా తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమనాథ భారతీ చివరకు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. తనను అరెస్టు చేయకుండా రక్షించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. తనను చిత్ర హింసలకు గురిచేశారని, హత్య చేసేందుకు రెండు సార్లు ప్రయత్నించారని సోమనాథపై ఆయన భార్య లిపికా మిత్రా కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, తొలుత వారిమధ్య సయోద్య కుదిర్చేందుకు ప్రయత్నించినా విఫలం అవడంతో చివరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఆయన ఢిల్లీలో కిందిస్థాయి కోర్టు ఆ తర్వాత హైకోర్టుకు ముందస్తు బెయిల్ కోసం వెళ్లగా ఆ కోర్టులు నిరాకరించాయి.
దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు కదిలినా ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాలేదు. తాజాగా ఆయన తరుపు న్యాయవాది మాత్రం సోమనాథ తరుపున సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశామని, ఆ బెయిల్ వ్యవహారం ఉన్నత న్యాయస్థానంలో తేలేంత వరకు పోలీసులు ఆయన బంధువులను, స్నేహితులను సోమనాథ అరెస్టు కోసం ఇబ్బందులు పెట్టవద్దని న్యాయవాది విజయ్ అగర్వాల్ కోరారు.