'ఓటమికి సోనియా, రాహుల్ బాధ్యులు కారు'
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బాధ్యులు కారని తిరువనంతపురం ఎంపీ, మాజీ కేంద్రమంత్రి శశీథరూర్ గురువారం న్యూఢిల్లీలో స్పష్టం చేశారు. ప్రతిపక్ష బాధ్యత తీసుకోవాలని ఆయన సోనియా, రాహుల్ గాంధీలను కోరారు. అప్పుడే పార్టీలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని అన్నారు. పార్టీలో, జాతీయ స్థాయిలో రెండు అధికార కేంద్రాలు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి, యూపీఏ ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదనడం సరికాదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు అవినీతి ఆరోపణలే దెబ్బతీశాయని పేర్కొన్నారు. అలాగే ప్రపంచ ఆర్థిక పరిణామాలు కూడా ఫలితాలపై ప్రభావం చూపాయన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆమూలాగ్రం సంస్కరించాల్సిన ఆవశ్యకతను శశీథరూర్ ఈ సందర్భంగా విశదీకరించారు. వచ్చే ఐదేళ్లూ సోనియా గాంధీ నాయకత్వమే కొనసాగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఏఐఏడీఎంకే అధ్యక్షురాలు జయలలిత మద్దతు ఇచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.