ఇటు నుంచి వీలుకాకపోతే... అట్నుంచి నరుక్కు రమ్మని సామెత! విభజన పర్వంలో కేంద్రం, కాంగ్రెస్ అధిష్టానం దీన్ని సరిగ్గా పాటించాయి.
రెండు రాష్ట్రాలకూ 371డి వర్తింపు
బాంబే పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 85 ఉదాహరణ
సాక్షి, హైదరాబాద్: ఇటు నుంచి వీలుకాకపోతే... అట్నుంచి నరుక్కు రమ్మని సామెత! విభజన పర్వంలో కేంద్రం, కాంగ్రెస్ అధిష్టానం దీన్ని సరిగ్గా పాటించాయి. పార్లమెంటులో మూడింట రెండు వంతులు, రాష్ట్ర అసెంబ్లీల్లో సగం ఆమోదం అవసరమనుకున్న ఆర్టికల్ 371 డి చిక్కును అధిగమించేందుకు ఇదే ఎత్తు వేశాయి. కాంగ్రెస్ మార్కు రాజకీయానికి ఇది అద్దం పడుతోంది. వెనుకబడిన ప్రాంతాల వారికి విద్య, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు 32వ రాజ్యాంగ సవరణ ద్వారా 1973లో ప్రవేశపెట్టిన 371డి పై చర్చోపచర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.
కేంద్రం ఈ అంశాన్ని చాలా తెలివిగా పక్కదోవ పట్టించింది. రాజ్యాంగ సవరణలు మూడు రకాలు. మొదటిది పార్లమెంటులో సాధారణ మెజారిటీతో చేయగలిగేవి. మూడింట రెండు వంతుల మెజారిటీతో చేయదగ్గవి రెండో రకమైతే... రాష్ట్ర అసెంబ్లీల్లో సగం అంగీకరిస్తేనే జరిగేవి మూడో రకం. 371డిని సవరించాలంటే మూడో ఆప్షన్‌ను పాటించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు కల్పిస్తూ చేర్చిన 371డి, 371ఈలను సవరణ ద్వారానే చేర్చారు. ఆ తరువాత ఈ సవరణను కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలతో కూడిన 7వ షెడ్యూల్‌లోనూ పొందుపరిచారు. రాజ్యాంగానికి ఏ రకమైన సవరణ చేసేందుకైనా ఆర్టికల్ 368 ద్వారా పార్లమెంటుకు హక్కు ఉంది. అయితే 7వషెడ్యూల్‌తో పాటు కొన్ని ఇతర అధికరణాలను, షెడ్యూళ్లను మాత్రం ప్రత్యేక మెజారిటీతో చేయాలి. 371డి సవరణకు ప్రత్యేక మెజారిటీ తప్పనిసరి అని అటార్నీ జనరల్ తేల్చి చెప్పినా కేంద్రం దీన్ని అధిగమించేందుకు బోంబే పునర్‌వ్యవస్థీకరణ చట్టం 85వ సెక్షన్‌ను ఉదాహరణగా తీసుకుంటోంది.
దీని ప్రకారం ఆర్టికల్ 371లో ‘స్టేట్ ఆఫ్ బోంబే’ స్థానంలో ‘ది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఆర్ గుజరాత్’ అని, ‘రెస్ట్ ఆఫ్ మహారాష్ట్ర’ అన్న పదాల స్థానంలో ‘అండ్ ది రెస్ట్ ఆఫ్ మహారాష్ట్ర ఆర్ యూజ్ ద కేస్ మే బీ’ అని మార్చాలని ప్రతిపాదించారు. ఇదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో ఆర్టికల్ 371లో ఒక రాష్ట్రం పేరు స్థానే 2 రాష్ట్రాల పేర్లు జొప్పించి, ఇరు ప్రాంతాలకూ 371డి కొనసాగిస్తారన్నమాట!