హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బీహెచ్) సెప్టెం బర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక నికర లాభంలో 24% క్షీణత నమోదయ్యింది. గతేడాది ఇదే కాలంలో రూ.213 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది రూ.163 కోట్లకు పడిపోయింది. ఇదే కాలానికి నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) మూడు శాతం క్షీణించి రూ.976 కోట్ల నుంచి రూ. 944 కోట్లకు తగ్గింది. మొత్తం ఆరు నెలల కాలానికి చూస్తే నికర లాభం రూ.17 శాతం క్షీణించి రూ.456 కోట్లుగా నమోదైనట్లు ఎస్‌బీహెచ్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
గత సంవత్సరంతో పోలిస్తే డిపాజిట్లు 14 శాతం పెరిగి రూ.1,21,986 కోట్లకు, రుణాలు 22 శాతం పెరిగి రూ. 96,548 కోట్లకు చేరుకున్నాయి. ఆర్థిక వృద్ధిరేటు నెమ్మదించడంతో ఆ ప్రభావం నిరర్థక ఆస్తులపై కనిపించింది. సమీక్షా కాలంలో స్థూల నిరర్థక ఆస్తులు రూ.3,186 కోట్ల(3.46%) నుంచి రూ.4,621 కోట్లకు (4.79%), నికర నిరర్థక ఆస్తులు రూ.1,149 కోట్ల (1.61%) నుంచి రూ. 2,338 కోట్ల(2.50%)కు పెరిగాయి. గత ఏడాది కాలంలో కొత్తగా 97 శాఖలను ప్రారంభించడం ద్వారా మొత్తం శాఖల సంఖ్య 1,490కి చేరిందని, వచ్చే ఐదు నెలల్లో 100 శాఖలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఎస్‌బీహెచ్ ఆ ప్రకటనలో పేర్కొంది.
24% క్షీణించిన ఎస్‌బీహెచ్ నికరలాభం
Published Tue, Oct 29 2013 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM
Advertisement
Advertisement