
రాహుల్‌ను పీఎం చేసేందుకే విభజన
రాష్ట్రాలను బలహీన పరచి, చిన్న రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయించేందుకు, రాహుల్‌గాంధీకి ప్రధాని పదవి కట్టబెట్టేందుకు సోనియా రాష్ట్ర విభజనకు ప్రయత్నిస్తున్నారని
వైఎస్సార్ సీపీ మాదిరిగా మిగతా పార్టీలూ ముందుకు రావాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిక్షణ వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్ లక్ష్మణ్‌రెడ్డి
నెల్లూరు, న్యూస్‌లైన్: రాష్ట్రాలను బలహీన పరచి, చిన్న రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయించేందుకు, రాహుల్‌గాంధీకి ప్రధాని పదవి కట్టబెట్టేందుకు సోనియా రాష్ట్ర విభజనకు ప్రయత్నిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిక్షణ వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్ లక్ష్మణ్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ‘సమైక్యాంధ్ర ఉద్యమం-మన కర్తవ్యం’ అనే అంశంపై నగరంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 9న తన జన్మదినం నాటికి రాష్ట్రాన్ని విభజించి కేసీఆర్‌కు తెలంగాణను అప్పగించేందుకు సోనియా అతివేగంగా పావులు కదుపుతున్నారన్నారు. రాజ్యాం గంలోని ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేస్తూ తాము ఎంపిక చేసుకున్న ప్రాంతాన్ని ముక్కలు చేసేందుకు యూపీఏ సర్కారు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. సమైక్యాంధ్ర కోసం స్పష్టమైన వైఖరి, నిబద్ధతతో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. మిగతా పార్టీలు కూడా స్పష్టమైన వైఖరితో ముందుకు కదిలితే ఉద్యమ తీవ్రత పెరుగుతుందన్నారు. జిల్లాకు చెందిన బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు విభజనకు మద్దతు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. విభజనకు మద్దతుగా ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకునేందుకు టీడీపీ అంగీకరించడంలేదని లక్ష్మణ్‌రెడ్డి తెలిపారు. మంత్రుల బృందం 7న సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో బుధ, గురువారాల్లో సమైక్యవాదులందరూ ఏకమై జాతీయ రహదారులు దిగ్బంధించి నిరసన గళాన్ని ఢిల్లీకి వినిపించాలని పిలుపునిచ్చారు. సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి తన సమైక్యవాదాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపాలని కోరారు. అసెంబ్లీలో సమైక్యాంధ్ర తీర్మానాన్ని ఆమోదింపజేసి ఆ ప్రతులను ఢిల్లీకి పంపి తమ సమైక్యవాదాన్ని నిరూపించుకోవాలన్నారు.
కాంగ్రెస్, టీడీపీ ద్వంద్వ వైఖరి వీడాలి
తెలంగాణ, సీమాంధ్రలో పబ్బం గడుపుకొనేందుకు కాంగ్రెస్, టీడీపీ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని వీడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. నెల్లూరులో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా రాష్ట్ర విభజనకు పాల్పడుతోందన్నారు. అఖిలపక్ష సమావేశాన్ని, మంత్రుల బృందాన్ని రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు.