
''షిండే హోం మంత్రిగా పనికిరాడు''
''హోం మంత్రిగా సుశీల్ కుమార్ షిండే ఏమాత్రం పనికిరాడు. ఆయన కంటే ఆర్థికమంత్రి చిదంబరం వంద రెట్లు నయం''.. ఈ మాటలన్నది ఎవరో కాదు. సాక్షాత్తు కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా నిన్న మొన్నటివరకు పనిచేసిన ఆర్.కె. సింగ్!! ఢిల్లీ పోలీసుల బదిలీలు, పోస్టింగులలో కలగజేసుకుంటున్నారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలోను, దావూద్ ఇబ్రహీంను ఇండియాకు రప్పించడంలో అమెరికా సాయం చేస్తోందంటూ తప్పుడు సమాచారం ఇచ్చినందుకు షిండే రాజీనామా చేసే అవకాశముందా అని టీవీ చానళ్ల విలేకరులు ఆర్కే సింగ్ను ప్రశ్నించగా ఆయనీ ఘాటు సమాధానం ఇచ్చారు. హోం మంత్రిగా చిదంబరం వందరెట్లు నయమని ఇటీవలే బీజేపీలో చేరిన ఆర్కే సింగ్ చెప్పారు. దావూద్ ఇబ్రహీం విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి అనవసరంగా దేశాన్ని తప్పుదోవ పట్టించారని షిండేపై విరుచుకుపడ్డారు. ఎఫ్బీఐ సమావేశాల్లో తాను కూడా పాల్గొన్నానని, కానీ తాము సాయం చేస్తామని వాళ్లు ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. తనకు, షిండేకు భేదాభిప్రాయాలున్న విషయం ప్రధానమంత్రితో సహా అందరికీ తెలుసన్నారు.
అయితే, రిటైరైన తర్వాత ఆర్కే సింగ్కు కొత్తగా ఉద్యోగం ఏదీ ఇవ్వలేదన్న దుగ్ధతోనే ఆయనీ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి వి. నారాయణసామి అన్నారు. ఇది చాలా దురదృష్టకరమని, ప్రభుత్వంలో ఉన్నత పదవిలో పనిచేసిన ఆయనకు చాలా పత్రాల గురించి తెలుసని, ఎలాంటి ఆధారం లేకుండా అనవసరంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. షిండే మాటల మనిషి కాదు, చేతల మనిషని నారాయణసామి కితాబిచ్చారు. ఆర్కేసింగ్ పదవిలో ఉండగా ఈ ఆరోపణలు చేసి ఉంటే వాటికి విలువ ఉండేదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు.