
రాష్ట్రపతి రేసులో సుష్మ, జోషి?
- సుమిత్రా మహాజన్, ఝార్ఖండ్ గవర్నర్ ద్రౌపది పేర్లు కూడా పరిశీలనలో
- అద్వానీకి అందని ద్రాక్షే.. ఎన్నికల ఫలితాల తర్వాతే స్పష్టత
న్యూఢిల్లీ: ప్రణబ్‌ముఖర్జీ తర్వాత రాష్ట్రపతి పదవి... ఎవరిని వరించనున్నదనే అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ పదవికి సంబంధించి ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి కాగా మరొకరు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్. మహిళా అభ్యర్థులకు సంబంధించి మరికొంతమంది పేర్లుకూడా వినవస్తున్నాయి. వారిలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఝార్ఖండ్ గవర్నర్ ద్రౌపది మర్ములు కూడా ఉన్నారు.
జూలైలో ఖాళీ అయ్యే ఈ పదవి కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒకనాడు గట్టి మద్దతుదారుడిగా నిలబడిన బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ పేరు మాత్రం పరిశీలనలో కూడా లేదు. ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చాక మాత్రమే ఇందుకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పదేళ్ల వయసులో ఉండగా అంటే 1944లో మనోహర్ జోషి ఆర్‌ఎస్‌ఎస్‌లో అడుగుపెట్టారు. 1991లో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ప్రధానమంత్రి అటల్‌బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో 1996, 1998, 1999లలో ఏర్పడిన ప్రభుత్వాల్లో ఆయన పనిచేశారు. తన సుదీర్ఘ రాజకీయ యాత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ ఆయన ఏక్తా యాత్రను నిర్వహించారు. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ చేరుకున్న అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయోధ్య ఉద్యమం సమయంలో జోషి...కీలకపాత్ర పోషించారు. 1992, డిసెంబర్‌లో బాబ్రీ మసీదు ధ్వంసం కాగా ఈ కేసుకు సంబంధించి ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. 1975, జూన్‌లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించి అనేకమందిని కారాగారం పాలుచేశారు. అందులో జోషి కూడా ఉన్నారు. ఆయన 19 నెలలపాటు శిక్ష అనుభవించారు.
ఇదిలాఉంచితే ఈ పదవి రేసులో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మోదీ కేబినెట్‌లో మంచి మంత్రిగా పేరు తెచ్చుకోవడమే ఇందుకు కారణం. దీంతో మహిళా వ్యతిరేకి అనే భావన ఆర్‌ఎస్‌ఎస్ కేడర్‌లో ఉన్నా మంచి మంత్రి అనే పేరు రావడం ఆమెకు సానుకూల వాతావరణం నెలకొనేందుకు దోహదం చేసింది. సొంత పార్టీతోపాటు ఇతర పార్టీ నాయకులతో ఆమెకు సత్సంబంధాలున్నాయి. ఇది ఆమెను రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టేందుకు ఓ వరంగా మారే అవకాశం కూడా లేకపోలేదు. అదే సమయంలో ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇది ఆమెకు ఓ రకంగా ఇబ్బందికరమైన పరిస్థితే. అయితే ఈ కారణంగానే ఆమెకు ఈ పదవి లభించొచ్చనేది కొంతమంది వాదన.