టబు కన్ఫర్మ్ చేసిందోచ్!
ముంబై: మంచి అభినేత్రిగా టబుకు బాలీవుడ్‌లో చక్కని పేరుంది. 'చాందినీ బార్', 'హైదర్' లాంటి విమర్శకుల ప్రశంసలందుకున్న సినిమాల్లో నటించిన ఈ భామ.. సినీవర్గాలను విస్మయపరుస్తూ.. తాజాగా కామెడీ జానర్ సినిమాకు సై అంటూ పచ్చజెండా ఊపింది. రోహిత్ శెట్టీ పాపులర్ కామెడీ ఫ్రాంచెజీ 'గోల్‌మాల్'లో నటించేందుకు ఓకే చెప్పింది. 'గోల్‌మాల్' లెటెస్ట్ వెర్షన్‌లో ఎప్పటిలాగే అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తుండగా అతని సరసన పరిణీతి చోప్రా నటించబోతున్నది. ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్ర పోషించబోతున్నది.
'గోల్‌మాల్' సిరీస్‌కు తాను పెద్ద అభిమానిని కావడంతో ఈ ఆఫర్ తనకు ముందుకు వచ్చినప్పుడు కాదనలేకపోయానని టబు తెలిపింది. 'ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు నేను షాక్ తినలేదు. సర్‌ప్రైజ్ కాలేదు. 'గోల్‌మాల్' సిరీస్‌ను నేను బాగా ఇష్టపడతాను. ఇందులో భాగం కానుండటంతో ఎంతో ఆనందం కలిగిస్తోంది. అజయ్ (దేవగణ్) నా స్నేహితుడు. మిగతా చిత్రయూనిట్ కూడా నాకు తెలుసు. స్నేహితులతో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఆనందమే కదా' అంటూ ఆమె ఓ దినపత్రికతో పేర్కొంది. ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యభరితమైన సీరియస్ పాత్రలు పోషించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టబు.. తనలో కామెడీ యాంగిల్ కూడా ఉందని, తనకు చాలా తొందరగా నవ్వు వస్తుందని పేర్కొంది.