ఒక నిర్ణయం తీసుకుంటే నేనే సీఎం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘కూలదోస్తాం.. ప్రజా స్వామ్య దేశంలో ఎవరూ శాశ్వత రాజులు కారు.. త్వరలో నా నిర్ణయాన్ని ప్రకటిస్తా’ అంటూ ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్ ట్విటర్‌లో పోస్టులు చేశారు. తనపై విమర్శలు చేసిన తమిళనాడు మంత్రులను కమల్ కవితా త్మక ధోరణిలో హెచ్చరించారు. అన్నాడీఎంకే ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అవినీతి తాండవిస్తోందని ఇటీవల కమల్ చేసిన విమర్శలపై మంత్రులు స్పందిస్తూ.. ఆయనను అరెస్టు చేయిస్తామని హెచ్చరించారు. మంత్రుల తీరును విపక్షాలు కూడా తప్పుపట్టగా, బుధవారం కమల్ ట్విటర్‌లో స్పందించారు. ‘నేను ఒక నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రిని.. ఓరీ సహచరుడా నావెంట రా.. మూర్ఖుడిని అడ్డుకునేవాడే నేత’ అని తన అభిమానులకు పిలుపు నిచ్చారు. అలాగే ‘నిరాశలో తల్లడిల్లుతున్నవారికి, ఆశతో ఉన్న నా అభిమానులకు త్వరలో ఓ మార్గం దొరుకుతుంది. కొన్నాళ్లు ప్రశాంతతను కాపాడండి’ అని పేర్కొన్నారు.