రెండు రోజుల గడువు కోరిన తరుణ్ తేజ్పాల్
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్... గోవా పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజుల గడువు కోరారు. ఈ మేరకు ఆయన గురువారం గోవా పోలీసులకు లేఖ రాశారు తరుణ్ తేజ్పాల్ తనకు రెండు రోజుల సమయం కావాలని ఓ లేఖ పంపినట్లు గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇనస్పెక్టర్ సునీతా సావంత్ వెల్లడించారు. ఆయన శనివారం మధ్యాహ్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. కాగా తరుణ్ తేజ్పాల్ ఈరోజు మధ్యాహ్నం లొంగిపోవాలని గోవా పోలీసులు ఇప్పటికే సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
కాగా పోలీసులు అరెస్టు చేయకుండా తనకు నాలుగు వారాల పాటు రక్షణ కల్పించాలని హైకోర్టును తేజ్‌పాల్ కోరారని ... ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై నిర్ణయాన్ని కోర్టు ఈనెల 29కి వాయిదా వేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో తరుణ్ తేజ్‌పాల్ గోవా పోలీసులకు లేఖ రాశారు. అలాగే పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు తాము సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని తరుణ్ తేజ్పాల్ తరపు న్యాయవాది సందీప్ కపూర్ తెలిపారు.
మరోవైపు హోటల్ సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీసీ టీవీ పుటేజ్ కీలకంగా మారింది. మహిళతో కలిసి తేజ్‌పాల్ వెళ్లినట్లు సీసీ టీవీలో నమోదు అయినట్లు తెలుస్తోంది. జర్నలిస్ట్ భుజాలపై తేజ్‌పాల్ చేతులు వేసి వెళ్తున్నట్లు అందులో ఉందని పోలీసులు తెలిపారు. దుస్తులు సవరించుకుంటూ ఓ మహిళ లిఫ్ట్ నుంచి బయటకొచ్చారని వారు చెబుతున్నారు. మరోవైపు... తేజ్‌పాల్‌ను రక్షించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ పదవికి షోమాచౌదరి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.