తెహల్కాకు షోమాచౌదరి రాజీనామా
న్యూఢిల్లీ: తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ పదవికి షోమా చౌదరి రాజీనామా చేశారు. మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణ్ తేజ్పాల్ను షోమా చౌదరి కాపాడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక తరుణ్ తేజ్‌పాల్‌కు న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురయింది. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.
పోలీసులు అరెస్టు చేయకుండా తనకు నాలుగు వారాల పాటు రక్షణ కల్పించాలని కోర్టును తేజ్‌పాల్ కోరారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై నిర్ణయాన్ని కోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది. మరోవైపు తరుణ్ తేజ్పాల్ను అరెస్ట్ చేసేందుకు గోవా పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని ఆయనకు గోవా పోలీసులు సమన్లు పంపారు. దాంతో విచారణ అనంతరం తేజ్‌పాల్‌ను అరెస్ట్ చేయొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.
గోవాలోని ఓ హోటల్‌లోని లిఫ్ట్‌లో మహిళా జర్నలిస్టును తేజ్‌పాల్ లైంగికంగా వేధించారనే అభియోగంపై గోవా పోలీసులు ఈ నెల 22న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తేజ్‌పాల్‌పై ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం), 376(2)(కె)(అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళపై అత్యాచారానికి ఒడిగట్టడం), 354 (దౌర్జన్యం) కింద అభియోగాలు మోపారు. వీటిలో సెక్షన్ 376 కింద ఆరోపణలు రుజుమైతే దోషికి జీవిత కాల శిక్ష పడే అవకాశం ఉంది.