టాటా మోటార్స్ వాహన ధరలు 1% అప్!
న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి ప్రయాణికుల(ప్యాసింజర్) వాహన ధరలను 1%మేర పెంచాలని ఆటో దిగ్గజం టాటా మోటార్స్ యోచిస్తోంది. అయితే వాణిజ్య వాహనాలకు సంబంధించి ధరలను పెంచే విషయంలో మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది. దీంతో ఈ విషయంలో నిర్ణయాన్ని తీసుకునేందుకు మరికొంత సమయం వేచి చూడనుంది.
వాణిజ్య వాహనాల విషయంలో మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ అవసరమైనప్పుడు ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటిస్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ప్యాసింజర్ వాహన ధరలను మాత్రం 2014 జనవరి నుంచి 1%మేర పెంచనున్నట్లు చెప్పారు. కంపెనీ నానో, ఇండికా తదితర బ్రాండ్ కార్లతోపాటు, వివిధ రకాల ట్రక్కులు, బస్సులను తయారు చేసే సంగతి తెలిసిందే. కాగా, జనవరి నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్లు మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడి, హోండా, మారుతీ, హ్యుందాయ్ ఇప్పటికే ప్రకటించాయి.