బాబు రాయ‘బేరం’: బొత్సతో టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ రహస్య భేటీ! | TDP, Congress Match Fixing:CM Ramesh's secret meeting with Botsa Satyanarayana | Sakshi
Sakshi News home page

బాబు రాయ‘బేరం’: బొత్సతో టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ రహస్య భేటీ!

Published Fri, Oct 4 2013 2:32 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

బాబు రాయ‘బేరం’: బొత్సతో టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ రహస్య భేటీ! - Sakshi

బాబు రాయ‘బేరం’: బొత్సతో టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ రహస్య భేటీ!

టీడీపీ-కాంగ్రెస్‌ల మ్యాచ్‌ఫిక్సింగ్‌లో మరో అంకానికి తెరలేచింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా సాగిస్తున్న కుమ్మక్కు కుట్రను మరింత తీవ్రం చేయడానికి రంగం సిద్ధమైంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి కేసులూ తన దరిదాపుల్లోకి రాకుండా కాంగ్రెస్‌ అధిష్టానం చూసుకునేలా, అలాగే జగన్‌ విషయంలో పన్నిన ఉచ్చును మరింత బిగించేలా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యూహం రూపొందించారు. ఈ మేరకు రాయ‘బేరాల’తో కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. గతంలో తాను నేరుగా కాంగ్రెస్‌ పెద్దలను కలిసినప్పటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, మీడియా కంటబడినా, మరోవిధంగా బయటకు పొక్కినా పుట్టగతులుండవనే ఉద్దేశంతో ఫిక్సింగ్‌ వ్యవహారం దొడ్డిదారిన ముందుకువెళ్లేలా బాబు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా పార్టీ ముఖ్యులు కొందరిని రహస్యంగా ఇటీవలి కొద్దిరోజులుగా కాంగ్రెస్‌ కీలక నేతల వద్దకు రాయ‘బేరాల’కు పంపుతున్నారు. వీటికి కొనసాగింపుగానే పార్టీలో తనకు అత్యంత సన్నిహితుడైన నేత ఒకరిని తాజాగా ఢిల్లీలోని రాష్ట్ర పీసీసీ అధƒ్యక్షుడి నివాసానికి పంపారు. దేశ రాజధానిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో బుధవారం రోజంతా వేదికను పంచుకున్న బాబు మరుసటి రోజే టీడీపీ రాజ్యసభ సభ్యుడు, తన ‘షాడో’ల్లో ఒకరైన సీఎం రమేష్‌ను రంగంలోకి దింపారు.
 
గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రమేష్‌ అత్యంత రహస్యంగా గురుద్వారా రకాబ్‌గంజ్‌ రోడ్డులోని 30వ నంబరు బంగళాకు వెళ్లి బొత్స సత్యనారాయణతో భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు బొత్స నివాసంలో గడిపిన రమేష్‌ బయట మీడియా ప్రతినిధులు కన్పించడంతో ఖంగుతిని ముఖం కనిపించకుండా కారులో నక్కికూర్చొని మరీ అక్కడినుంచి జారుకున్నారు. బొత్స, రమేష్‌ల భేటీలో అనేక ‘ముఖ్యమైన’ అంశాలపై చర్చజరిగినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వరకు పకడ్బందీ వ్యూహంతో కొనసాగిస్తున్న మ్యాచ్‌ఫిక్సింగ్‌ను.. రాజకీయ సమీకరణాలు, పొత్తు ప్రాధాన్యాలు మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇక మీదట ఏ తీరున కొనసాగించాలనే దానిపై చంద్రబాబు ఇచ్చిన సూచనల ప్రకారం రమేష్‌, బొత్సతో మంతనాలు కొనసాగించారని ఆ వర్గాలు వెల్లడించాయి. తన కేసుల జోలికి రావద్దనే: చంద్రబాబు గుజరాత్‌ సీఎం మోడీతో వేదిక పంచుకున్న బుధవారం రోజే సీబీఐ డెరైక్టర్‌ రంజిత్‌ సిన్హా కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్‌‌జ దిగ్విజయ్‌ సింగ్‌ను కలిశారని మీడియాలో వార్తాకథనాలు ప్రచురితమయ్యాయి. సీబీఐ డెరైక్టర్‌ స్వయంగా దిగ్విజయ్‌ నివాసానికి వెళ్లడం గురించి పత్రికల ద్వారా తెలుసుకున్న చంద్రబాబు బుధవారం రాత్రి పార్టీ ముఖ్య నేతలు కొందరిని పిలిచి ఆ భేటీపై లోతుగా ఆరా తీశారు. అనంతరం సీఎం రమేష్‌కు నిర్దిష్ట సూచనలు చేసి ఫిక్సింగ్‌ను ముందుకు తీసుకెళ్లే బృహత్తర బాధ్యతను అప్పచెప్పారని సమాచారం.
 
బీజేపీతో దోస్తీ, మోడీతో మంతనాల నేపథ్యంలో కాంగ్రెస్‌ తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందేమోనన్న అనుమానం, భయంతోనే చంద్రబాబు ముందు జాగ్రత్తగా తన కేసుల జోలికి వెళ్లొద్దనే తన వేడుకోలును రమేష్‌ ద్వారా బొత్సకు, ఆయన నుంచి కాంగ్రెస్‌ హైకమాండ్‌కు చేరేలా చేశారని టీడీపీ వర్గాలు తెలిపాయి. అలాగే జగన్‌పై పెట్టిన కేసుల విచారణను వేగవంతం చేయడంతో పాటు ఆయన హైదరాబాద్‌లో తలపెట్టిన సమైక్య శంఖారావం సభ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా చూడాలన్న బాబు వర్తమానాన్ని కూడా బొత్సకు రమేష్‌ చేరవేశారని, తన వర్తమానం కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దలకు చేరేలా చూసి ‘అవసరమైన చర్యలు’ సత్వరమే చేపట్టేలా చూడాల్సిందిగా కోరారని ఆ వర్గాలు వెల్లడించాయి. బెయిల్‌పై బయటకు వచ్చిన జగన్‌తో కాంగ్రెస్‌, టీడీపీలు రెండింటికీ ముప్పు ఉందని, ఇరుపార్టీలు ఘోరంగా దెబ్బతినే అవకాశాలు కళ్లముందు స్పష్టంగా కనిపిస్తున్నందున ఆయన కట్టడికి సాధ్యమైనంత గట్టి చర్యలు తీసుకోవాలని బాబు తరఫున రమేష్‌ కోరినట్టు బొత్స సన్నిహిత వర్గాలు కూడా తెలిపాయి. మొత్తం మీద జగన్‌ విషయంలో కలిసి కొనసాగిస్తున్న కుట్రను ముందుకు తీసుకెళ్లే విషయంలో పునరాలోచన చేయవద్దని, యధాతథంగా ఫిక్సింగ్‌ వ్యవహారంతో ముందుకెళితే రెండు పార్టీలకు గుడ్డిలో మెల్ల చందాన కాస్తంతైనా ఊరట ఉంటుందన్నది బాబు ఆలోచనగా ఆ వర్గాలు చెప్పాయి. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ అవసరాలరీత్యా టీడీపీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ రాష్ట్రం వరకు మాత్రం జగన్‌ లక్ష్యంగా మ్యాచ్‌ఫిక్సింగ్‌తో, పరస్పర సహకారంతో ముందుకు సాగడం అవసరమని రమేష్‌ పీసీసీ అధినేతకు వివరించినట్టు తెలుస్తోంది. రమేష్‌ చెప్పినదంతా సావధానంగా విన్న పీసీసీ అధ్యక్షుడు బాబు మనోగతాన్ని కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తెలియజేసి వారి స్పందనను వీలువెంబడి తెలియపరుస్తానని చెప్పినట్టు సమాచారం.
 
తత్తరపడిన బొత్స.. దాక్కున్న రమేష్‌
 
బొత్స నివాసంలో సీఎం రమేష్‌ ఉన్నారనే సమాచారం బయటకు పొక్కడంతో కొందరు మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. ఒకరిద్దరు ప్రతినిధులు బొత్స నివాసంలోకి రావడం గమనించిన రమేష్‌ ఓ మూల గదిలో దాక్కోగా, బొత్స తత్తరపాటుగా ‘ఏంటి ఇలావచ్చారంటూ’ బయటకు వచ్చి మీడియా ప్రతినిధులను అడిగారు. బొత్స వ్యక్తిగత సిబ్బంది కూడా ఇక్కడ దేనికి ఉన్నారంటూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. ఇదంతా అయ్యాక బొత్స నివాసం నుంచి రమేష్‌ సినీఫక్కీలో బయటకు వెళ్లారు. ముందుగా తన సొంత కారును బయటకు పంపించేసి మరో చిన్న కారును లోపలికి రప్పించారు. అందులో రమేష్‌ తన ముఖం బయటివారెవరికీ కనిపించని రీతిలో నక్కి కూర్చోగా, శరవేగంగా కారును నడిపించిన డ్రైవర్‌ విలేకరుల ఫోటోలకు సైతం చిక్కకుండా బయటకు దూసుకుపోయాడు.సీఎం రమేష్‌ ః జీఆర్‌జీ-30 : ఇన్‌.. డీఎల్‌ 3సీ ఏవై 8433
 
గురుద్వారా రకాబ్‌ గంజ్‌ (జీఆర్‌జీ) రోడ్డులోని 30వ నంబరు బంగళా కాంగ్రెస్‌ ఎంపీ, బొత్స సతీమణి బొత్స ఝాన్సీ అధికారిక నివాసం. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో డీఎల్‌ 3సీ ఏవై 8433 నంబరు కారు ఒకటి వేగంగా ఆ ఇంటికి వచ్చింది.
 
తానెప్పుడూ ఉపయోగించే ఆ కారులోంచి దిగిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ వడివడిగా ఆ క్వార్టర్‌లోకి వెళ్లారు. కొద్దిరోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి ఉన్న పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నారు. కాంగ్రెస్‌-టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్‌పై దాదాపు గంటసేపు ఇద్దరి మంతనాలు కొనసాగాయి. బయట మీడియా హడావుడితో రమేష్‌ చాలాసేపు ఆ ఇంట్లోనే ఉండిపోయారు.
చివరకు మీడియా కన్నుగప్పి వెళ్లిపోయే ప్రయత్నంలో మరో కారు తెప్పించుకుని అందులో నక్కి కూర్చొని బొత్స నివాసం నుంచి నిష్ర్కమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement