మా వాళ్లే ఒక్క మాటపై నిలబడ్డారు: బొత్స సత్యనారాయణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మొదటి నుంచి ఒకే మాటమీద నిలబడిన వాళ్లు తమ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాత్రమేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రోజుకో మాట చెబుతూ రాజకీయ లబ్ధి కోసం కొత్త నాటకాలు మొదలుపెట్టాయని విమర్శించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సున్నితమైన రాష్ట్ర విభజన అంశంలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తమ బాధ్యతను విస్మరించాయన్నారు. విభజనపై అభిప్రాయం చెప్పే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడకుండా.. సీమాంధ్రలో ఈరోజు ప్రజలు ఆందోళన చెందుతుంటే రాజకీయ లబ్ధి కోసం డ్రామాలాడుతున్నాయని విమర్శించారు.
అందులో భాగంగా గుంటూరులో ‘సమ న్యాయం’ పేరిట కొత్త నాటకం మొదలుపెట్టారని విమర్శించారు. 2008లో ప్రణబ్ కమిటీకి మొదలు పలు సందర్భాల్లో రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇచ్చిన చంద్రబాబునాయుడు నేడు ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆత్మగౌరవ యాత్ర చేపడతున్నట్లు చెప్పడం విడ్డూరమని బొత్స మండిపడ్డారు. విభజనపై లేఖ ఇచ్చేటప్పుడు చంద్రబాబు ప్రజల అభిప్రాయాన్ని ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల, ప్రాంతాల ప్రజల మనోభావాలను క్రోడీకరించి తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఊరుకోమని చెబుతున్న టీడీపీ నేతలు అశోక్‌గజపతిరాజు, గాలి ముద్దుకృష్ణమనాయుడు 2009 డిసెంబర్ 7న జరిగిన అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రాన్ని విభజించాల్సిందేనని, అలా చేయని పక్షంలో కాంగ్రెస్ మెడలు వంచుతామని చెప్పారన్నారు.