
10 వరకు అసెంబ్లీ
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 10వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
* బీఏసీ సమావేశంలో నిర్ణయం
* 10 రోజుల పాటు వర్షాకాల సమావేశాలు
* నేటి నుంచి సోమవారం దాకా సెలవులు
* 29న రైతు ఆత్మహత్యలు, వ్యవసాయంపై చర్చ
* ప్రశ్నోత్తరాల సమయం గంటన్నరకు పెంపు
* ఆ తర్వాతే వాయిదా తీర్మానాలు
* పార్టీ ఫిరాయింపులపై చర్చించాలన్న ఎర్రబెల్లి
* దీనిపై గతంలో ఎన్నడూ చర్చించలేదని, ఈసారీ అంగీకరించబోమన్న మంత్రి హరీశ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 10వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సభను జరపాలని నిర్ణయించింది. మొత్తంగా పది రోజులపాటు సమావేశాలు జరుగుతాయి. గురువారం (24వ తేదీ) నుంచి 28 వరకు, అక్టోబర్ 2 నుంచి 4 వరకు సెలవులుగా ప్రకటించారు. అక్టోబర్ 5 నుంచి 10 వరకు వరుసగా ఆరు రోజుల పాటు సభ జరగనుంది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి మృతికి సభ సంతాపం తెలిపింది. నేతల సంతాప సందేశాల తర్వాత స్పీకర్ మధుసూదనాచారి సభను ఈనెల 29కి వాయిదా వేశారు. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశం జరిగింది.
రైతు ఆత్మహత్యలపై అవసరమైతే రెండ్రోజులు
సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై బీఏసీ సుమారు గంటపాటు చర్చించింది. సమావేశంలో పాల్గొన్న సభ్యుల నుంచి అందిన సమాచారం మేరకు.. ప్రతిరోజూ నిర్వహించే ప్రశ్నోత్తరాల సమయాన్ని గంటన్నరకు పెంచాలని నిర్ణయించారు. వాయిదా తీర్మానాలను కూడా ప్రశ్నోత్తరాల సమయం తర్వాతే ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఇందుకు టీడీపీ అంగీకరించలేదు. 29వ తేదీన ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ రంగంపై చర్చిస్తారు. ఒకరోజు సమయం సరిపోకపోతే మరో రోజు కూడా చర్చకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇవే కాకుండా సాగునీటి ప్రాజెక్టులు, రీ డిజైనింగ్, మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు, పారిశ్రామిక పాలసీ, విద్యుత్, విషజ్వరాలు, వైద్యసేవలు, తదితర అంశాలపై సమావేశాల్లో చర్చించనున్నారు. వివిధ రంగాల్లో ప్రభుత్వం చేస్తున్న కృషిని సభా వేదికగా ప్రజలకు వివరించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది.
ఫిరాయింపులపై చర్చించలేం..
అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ ఫిరాయింపులపై చర్చకు ప్రభుత్వం అంగీకరించలేదు. బీఏసీ సమావేశంలో ఈ అంశాన్ని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి లేవనెత్తారు. అయితే ఫిరాయింపుల అంశాన్ని గతంలో ఎన్నడూ సభలో చర్చించలేదని, ఈసారి కూడా చర్చకు అంగీకరించమని మంత్రి హరీశ్‌రావు అన్నట్లు సమాచారం. ఇదే అభిప్రాయాన్ని సీఎల్పీ నేత జానారెడ్డి కూడా వ్యక్తం చేసినట్లు తెలిసింది. తమకు ముందు వరుసలో రెండు సీట్లు కేటాయించాలని ఎర్రబెల్లి వాదనకు దిగగా.. బీఏసీ సమావేశం నిర్వహిస్తోంది సీట్ల కేటాయింపు కోసం కాదని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. సీట్ల కేటాయింపుపై స్పీకర్, శాసనసభ కార్యదర్శిని సంప్రదించాలని, ప్రతిపక్షాలు చెప్పినట్లు చేయడానికి ప్రభుత్వం లేదని సీఎం కేసీఆర్... ఎర్రబెల్లికి చురకేసినట్లు తెలిసింది. ఏవైనా డిమాండ్లు ఉంటే రాతపూర్వకంగా ఇవ్వాలని సూచించారు.
తమపై మంత్రులు ఎదురు దాడి చేస్తున్నారని, ఒకేసారి ముగ్గురు ముగ్గురు సమాధానాలు ఇస్తున్నారని, మంత్రులను సీఎం కంట్రోల్ చేయాలని ఎర్రబెల్లి పేర్కొనగా.. ‘‘మీ వాళ్లు అయిదారుగురు లేసి మాట్లాడితే, మంత్రులు అలా సమాధానం ఇవ్వక ఏం చేస్తారు..’’ అని సీఎం అన్న ట్లు సమాచారం. సభలో చర్చ సక్రమంగా జరగాలని, సభ జరగకుండా గొడవ చేస్తే ప్రభుత్వం ఊరుకోద న్న అంశంపై సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. బీఏసీ భేటీలో సీఎం కేసీఆర్‌తోపాటు, స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు, మం త్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌తోపాటు సీఎల్పీ నేత జానారెడ్డి, చిన్నారెడ్డి(కాంగ్రెస్), ఎర్రబెల్లి దయాకర్‌రావు(టీడీపీ), అక్బరుద్దీన్ ఒవైసీ(ఎంఐఎం), లక్ష్మణ్(బీజేపీ), పాయం వెంకటేశ్వర్లు (వైఎస్సార్‌సీపీ), సున్నం రాజయ్య (సీపీఎం), రవీంద్ర కుమార్ (సీపీఐ) పాల్గొన్నారు.