
ఉద్యమించని వారు పునర్నిర్మిస్తారా?
తెలంగాణలో ఎవరికి అధికారం ఇవ్వాలో ప్రజలు ఆలోచించాలి : హరీష్
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్న ఈ ప్రాంతప్రజలు రేపు తెలంగాణలో ఎవరికి అధికారం ఉండాలో కూడా ఆలోచించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు కోరారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం 17వ రాష్ట్ర మహాసభలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో మొన్నటి వరకు ఏనాడూ పాల్గొనని వాళ్లు.. సకల జనుల సమ్మె, ధర్నాలు, ఇతర ఏ రకమైన ఆందోళన చేసినా బయటకు రాని వారు ఇప్పుడు ఇస్త్రీ చొక్కాలు తొడుక్కొని తెలంగాణ ఇచ్చింది మేమే, తెచ్చిందీ మేమేనంటూ వస్తున్నారని పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. మరికొందరు తమవల్లే తెలంగాణ వచ్చిందని చెప్పకుంటున్నారంటూ పరోక్షంగా టీడీపీ నేతలనూ తూర్పారపట్టారు. ఇన్నాళ్లు మనగోడు పట్టించుకోని వారు తెలంగాణలో అధికారంలో ఉంటే మన సమస్యలు పరిష్కారమవుతాయా అని ప్రశ్నించారు.
తెలంగాణ కోసం పోరాడిన వారు, ఉద్యమంలో ఉన్నవారే ఇక్కడి సమస్యలు అర్థం చేసుకోగలుగుతారని హరీష్‌రావు చెప్పారు. 13ఏళ్లుగా ప్రజల మధ్య ఉండి ఉద్యమంలో పాల్గొన్న టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు వల్లే తెలంగాణలో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.కేసీఆర్ చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని పునర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత తాను ఏ హోదాలో ఉన్నా ఉద్యోగుల సమస్య పరిష్కారం చేస్తానన్నారు. 108, 104 ఉద్యోగులను కూడా వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ఉద్యోగులుగానే గురిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులందరికీ కనీసం వేతనం అమలు చేస్తామన్నారు.
వచ్చే తెలంగాణలో టీఆర్‌ఎస్‌దే కీలక పాత్ర
తెలంగాణ పునర్నిర్మాణంలో టీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని, అన్ని కులవృత్తులకు సరైన గుర్తింపు ఇస్తామని హరీష్‌రావు అన్నారు. హైదరాబాద్‌లోని కొత్తపేట బీజేఆర్ భవన్‌లో తెలంగాణ నాయీబ్రాహ్మణ సేవా సంఘం ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణుల క్షౌరశాలలకు తక్కువ ధరకే విద్యుత్ ఇస్తామనిన్నారు. పక్కా గృహాలు, రిటైర్డ్ నాయీబ్రాహ్మణులకు పీఎఫ్, ఈఎఫ్‌ఐ పింఛన్ ఇప్పిస్తామన్నారు.
ఆ నిధుల వెనుక సీఎం దురుద్దేశం.. హైకోర్టులో పిల్
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లబ్ది పొందాలనే దురుద్దేశంతోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి సొంత జిల్లా చిత్తూరు తాగునీటి పథకానికి రూ. 4,300 కోట్లు కేటాయించారంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. చిత్తూరు తాగునీటి పథకానికి నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన విభాగం (ఏపీఐఐసీ) గత అక్టోబర్ 10న జారీచేసిన 14,15 జీవోలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని ఆ పిల్‌లో అభ్యర్థించారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఐఐసీ, గ్రామీణ నీటిపారుదల శాఖలను ప్రతివాదులుగా చేర్చారు. ఇది సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.