
కేసీఆర్ కళ్లు నెత్తికెక్కాయి: చాడ
కేసముద్రం: సీఎం కేసీఆర్ కళ్లు నెత్తికెక్కాయని, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులెవరూ ఇప్పుడు ఆయనకు కనిపించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. వరంగల్ జిల్లా కేసముద్రంలో గురువారం నిర్వహించిన సీపీఐ రాజకీయ-సైద్ధాంతిక శిక్షణ తరగతుల్లో చాడ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కలసి పనిచేసిన మిత్రులంతా కేసీఆర్‌కు ఇప్పుడు శత్రువులయ్యారని, ఉద్యమ వ్యతిరేకులేమో మిత్రులయ్యారని విమర్శించారు. మంత్రుల్లో సగం మంది ఉద్యమ వ్యతిరేకులేనని అన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జేఏసీ చైర్మన్ కోదండరాంపై మంత్రులు విమర్శలు చేయడం తెలంగాణ ప్రజలను అవమానపర్చినట్టేనని అన్నారు. ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ, ఇప్పుడు ప్రభుత్వంపై నిరసన కేంద్రంగా మారిందన్నారు. రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో ఏ మాత్రం అభివృద్ది కనిపించడంలేదని, విద్య, వైద్యంతోపాటు అన్నింటిలోనూ వెనుకబడే ఉన్నామని అన్నారు.