తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్న రోజులవి.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దళితవాడల్లో రాత్రిబస చేయాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది.. దీనిలో భాగంగా అప్పటి ఉద్యమ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ఖర్‌రావు యాదగిరిగుట్టకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వర్టూర్ గ్రామంలో ర్రాతి బస చేశారు.. ఆ కాలనీ వాసులుకు ఎన్నో హామీలు ఇచ్చారు.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి.. ఏడాది కూడా పూర్తయింది.. కానీ కేసీఆర్ హామీలు నీటి మూటలుగానే మిగిలాయి.. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఏడు పర్యాయాలు యాదగిరీశుడిని దర్శించుకున్నా..పక్కనే ఉన్న తమను మరచిపోయారని వర్టూర్ పల్లె కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు.
- యాదగిరిగుట్ట
2008 ఏప్రిల్ 14 వ తేదీ రాత్రి సహచర నాయకులతో కలిసి బస్సులో కేసీఆర్ గ్రామానికి చేరుకున్నారు. ఆ రాత్రి ఆయన కాలనీలోని ఆడెపు లక్ష్మయ్య ఇంట్లో నిద్ర చేశారు. మరునాడు 15వ తేదీన ఉదయమే నిద్ర లేచి ఊరుబయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకున్నారు. అనంతరం నోట్లో వేపపుల్ల వేసుకుని గ్రామంలో తిరుగుతూ ఎస్సీ కాలనీలో, గ్రామంలో ఉన్న సమ
స్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
ఇంటికో గేదె ఏమైంది..?
కాలనీలో ఉన్న వారందరికీ ఇంటికో గేదె ఇస్తానని, వారి వ్యవసాయ పనులకు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. బోర్లు, బావులు వేయించేందుకు సహాయం చేస్తానన్నారు. కానీఇంత వరకు వారికి ఎలాంటి సహాయం అందించలేదు.
ప్రతిభావంతులను ప్రోత్సహిస్తానని..
ఆ కాలనీలో ఉంటున్న ఆడెపు బుచ్చయ్య కూతురు వెన్నెల బాగా చదువుకుంటుందని తెలుసుకుని ఆమెను పిలిపించారు. అప్పుడు ఆ అమ్మాయి 7వ తరగతి చదువుతోంది. ఆమెకు ఇంటర్ తర్వాత ఉన్నత చదువులకు ఆర్థికసాయం అందిస్తానన్నారు. ఆమె ప్రస్తుతం నర్సింగ్ కోర్సు చేస్తోంది.ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమె చదువు ముందుకు సాగడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రశాంత్ అనే మరో అబ్బాయికి, మరో ముగ్గురు విద్యార్థులకు ఇలా వారి ఉన్నత చదువులకు సహాయం అందిస్తానని అందరి ముందు హామీఇచ్చారు. కానీ ఈ విద్యార్థులకు ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందలేదు. మంచి ప్రతిభ ఉండి కూడా ఈ విద్యార్థులంతా ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు. కేసీఆర్ సహాయం కోసం ఈ విద్యార్థులు, కాలనీ వాసులు వెయ్యికన్నులతో ఎదురుచూస్తున్నారు. 15వ తేదీ మధ్యాహ్నం వరకు కాలనీలోనే గడిపిన కేసీఆర్ దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం తనకు అతిథ్యం ఇచ్చిన ఆడెపు లక్ష్మయ్య, ఆడెపు యాదయ్య, ఆడెపు ఎల్లయ్యలకు మర్యాదపూర్వకంగా రూ.5 వేల చొప్పున అందించారు. కేసీఆర్ వెంట వచ్చిన నాయకులు అంతా కాలనీ వాసులకు వాయినాలు ఇచ్చారు. ఆ తర్వాత సమావేశం నిర్వహించి, తాను ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని స్పష్టం చేశారు. అదే రోజు సాయంత్రం ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు.
కేసీఆర్ వస్తారు.. హామీలు నెరవేరుస్తారు..
తెలంగాణ ఉద్యమం విజయవంతం అయి రాష్ట్రం సిద్దించింది. కేసీఆర్ సీఎం అయ్యారు. దీంతో ఉద్యమనేతగా కేసీఆర్‌కు ఆతిథ్యం ఇచ్చిన వర్టూర్ పల్లె, ఆ గ్రామ ఎస్సీ కాలనీ తమ బిడ్డే సీఎం అయ్యారన్నంతగా పులకించిపోయింది. కానీ కేసీఆర్ ఇప్పటి వరకు తమ గురించి ఆలోచించకపోవడం పట్ల వారు ఆవేదనచెందుతున్నారు. ఇన్ని సార్లు గుట్టకు వచ్చినా పక్కనే ఉన్న తాను బస చేసిన ఊరును గుర్తు పెట్టుకోకపోవడం పట్ల గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఎప్పటికైనా కేసీఆర్ తమను గుర్తిస్తారనే ఆశతో వారు ఉన్నారు. ఎలాగైనా కేసీఆర్‌ను కలవాలనే తపనతో అనేక సార్లు ప్రయత్నించారు. కాని కుదరలేదు. ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా తమ ఆశ నెరవేరుతుందని ఆ కాలనీ వాసులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
సీఎం కేసీఆర్ సహాయం చేస్తారని ఆశ పడుతున్నాం
అప్పట్లో సీఎం కేసీఆర్ నా కూతురు వెన్నెలకు ఉన్నత చదువులకు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో నేటి వరకు కేసీఆర్ నుంచి సహాయం అందలేదు. ఇప్పటికైనా అందుతుందనే ఆశ ఉంది. ఆయన ఒక్కసారి తల్చుకుంటే ఇదేం పెద్ద పని కాదు. నా కూతురు వెన్నెలతో పాటు మరి కొంత మంది పిల్లలకు ఉన్నత చదువులకు సహాయం చేస్తానని ఆయన అప్పట్లో హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి మాకు తగిన సహాయం చేయాలని కోరుతున్నాం.
- ఆడెపు బుచ్చయ్య,
వెన్నెల తండ్రి
కేసీఆర్‌జీ.. వర్టూర్‌పల్లె యాదికి లేదా..?
Published Sun, Jul 5 2015 2:53 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
Advertisement
Advertisement