సీఏ ఫైనల్, సీపీటీ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా
* సీపీటీలో టాప్-10లో ఐదుగురు తెలుగు విద్యార్థులే
* ఫలితాలను వెల్లడించిన ఐసీఏఐ
* సీఏ ఫైనల్‌లో ప్రథమ ర్యాంకు హైదరాబాద్ వాసిదే
* సీపీటీలో నిజామాబాద్‌కు ప్రథమ ర్యాంకు
సాక్షి, హైదరాబాద్: సీఏ ఫైనల్, సీపీటీ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. సీపీటీలో అల్ ఇండియా ప్రథమ, తృతీయ ర్యాంకులతోపాటు టాప్-10లో మొత్తం ఐదు ర్యాంకులను తెలంగాణ, ఏపీకి చెందిన విద్యార్థులే సాధించారు. సీఏ ఫైనల్‌లో ఆల్ ఇండియా ప్రథమ ర్యాంకుతో పాటు మరిన్ని ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది మేలో నిర్వహించిన సీఏ ఫైనల్, సీపీటీ పరీక్షల ఫలితాలను గురువారం ది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) విడుదల చేసింది. సీఏ-సీపీటీ ఫలితాల్లో నిజమాబాద్‌కు చెందిన ఎం.నరేశ్ కుమార్ ఆల్‌ఇండియా ప్రథమ ర్యాంకును సాధించాడు. 200 మార్కులకు గానూ 192 మార్కులు సాధించారు. అలాగే విజయవాడకు చెందిన కట్ల సురేశ్ ఆల్‌ఇండియా మూడో ర్యాంకు సాధించాడు. చిత్తూరు జిల్లాకు చెందిన పి.జశ్వంత్‌రెడ్డికి 9వ ర్యాంకు, బి.మనీషా, ఎల్.రాశికి 10వ ర్యాంకు వచ్చింది. కాగా, సీఏ ఫైనల్‌లో 800 మార్కులకు గానూ సికింద్రాబాద్‌కు చెందిన రాహుల్ అగర్వాల్, ఢిల్లీకి చెందిన శైలీ చౌదరి 606 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారు. మచిలీపట్నానికి చెందిన చిట్టూరి లక్ష్మీ అనూష 584 మార్కులతో రెండో స్థానాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా 42,847 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయగా 8.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
టాపర్ల అభిప్రాయాలు..
రోజుకు 14 గంటలు చదివాను: నరేశ్ కుమార్ , మొదటి ర్యాంకర్
సీఏ-సీపీటీలో మొదటి ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. రోజుకు 14 గంటలు కష్టపడి చదివాను. ఇంటర్‌లో 973 మార్కులు వచ్చాయి. సీఏ పూర్తి చేసి నా తల్లిదండ్రుల కల నిజం చేస్తాను.
గ్రామానికి సేవ చేయడమే నా లక్ష్యం: కట్ల సురేశ్, 3వ ర్యాంకర్
మాది సాధారణ రైతు కుటుంబం. బాగా చదువుకొని పేరు ప్రతిష్టలు సంపాదించాలన్నదే నా లక్ష్యం. చార్టెర్డ్ అకౌంటెంట్‌గా స్థిరపడాలి. మా గ్రామానికి సేవ చేయడమే నా ముందున్న లక్ష్యం తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే మూడో ర్యాంకు సాధించాను.
అందరి ప్రోత్సాహంతోనే: పి.జశ్వంత్ రెడ్డి, 9వ ర్యాంకర్
నాన్నకు ఆరోగ్యం సరిగా లేక ఇంట్లోనే ఉంటున్నారు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదురైనా నన్ను సీఏ చదివించాలన్న లక్ష్యంతో నాన్న నన్ను ప్రోత్సిహ ంచారు. అధ్యాపకులు, స్నేహితులు అందరి సహకారంతోనే 9వ ర్యాంకు సాధించాను.