ఆడినా.. ఆడకున్నా సచిన్‌తోనే..
ఆడినా.. ఆడకున్నా సచిన్‌తోనే..
Published Fri, Oct 11 2013 12:33 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ.. ఆయన వెన్నంటే ఉంటామంటున్నాయి పలు కంపెనీలు. సచిన్ ఆడినా.. ఆడకున్నా బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయనతో తమ ఒప్పందాల్లో మార్పులేమీ ఉండబోవంటున్నాయి. రిటైర్మెంట్ తర్వాత కూడా దీర్ఘకాలం ఆయనతో అనుబంధం కొనసాగిస్తామని ఆ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం అడిడాస్, కోక కోలా, ఫ్యూచర్ గ్రూప్, తోషిబా, అవైవా ఇండియా, ఎస్‌ఏఆర్ గ్రూప్ వంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
‘సచిన్‌తో జీవితకాల అనుబంధం ఉంటుంది. తను ఆడినా, ఆడకున్నా ఈ అనుబంధంపై ప్రతికూల ప్రభావాలేమీ ఉండవు. తను చాలా స్పెషల్’ అని అడిడాస్ ఇండియా బ్రాండ్ డెరైక్టర్ తుషార్ గోకుల్‌దాస్ చెప్పారు. అటు కోక కోలా ఇండియా కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సచ్ బ్రాండ్ టూత్‌పేస్టులు వంటి ఉత్పత్తులకు సంబంధించి సచిన్‌తో అనుబంధం ఆయన రిటైర్మెంట్ తర్వాతా కొనసాగుతుందని ఫ్యూచర్ బ్రాండ్స్ ఎండీ సంతోష్ దేశాయ్ చెప్పారు. ఎండార్స్‌మెంట్ల సంఖ్య కాస్త తగ్గితే తగ్గొచ్చు కానీ.. రిటైరైనా సచిన్ బ్రాండ్ విలువకు ఢోకా ఉండబోదని దేశాయ్ అభిప్రాయపడ్డారు.
Advertisement
Advertisement